ళి మహారత్నము సీత యేమడిగినన్ లేదంచనన్ రాదు, ని
త్యముఁ గాంతార విహారఖిన్నమతి యేదైనన్ సరే కోరు, ను
త్తమురా లయ్యది తీర్చుటే మిగుల యుక్తంబౌను శ్రీరాఘవా !
అన్యుల్ భార్య నగౌరవింత్రు, రఘురామా ! దంపతిశ్రేణి య
న్యోన్యారాధనఁ జేసి యుత్తమ జగత్ప్రాప్తిన్ విడంబింత్రు, స
మ్మాన్యుల్ భార్యను బట్టి వత్తురు నిలింపశ్రేణి క్రీడింప రా
జన్యశ్రేష్ఠ ! భవద్గృహాళి, వషట్ స్వాహా ప్రియాహూతులై.
రమణి రమణీత్వముననె యారాధనీయ
రమణి భార్యాత్వమునను నారాధనీయ
రమణి సీత పతివ్రతోత్తమ జగచ్ఛి
రస్థమణి దాన మిగుల నారాధనీయ.
నీరజనేత్ర ముగ్ధహరిణీప్రియ నీ సుకుమారి నిట్లు కాం
తారము తెచ్చినావు, విదితంబగు శైవధనుర్వికర్షణ
క్రూరభుజాభిరాముడవు కోమలి కోరిక దీర్ప నీకు నీ
శూరత చాలదో, మరి అసుప్రియ జానకి ప్రేమ చాలదో !
అగస్త్య మహర్షి రామునికి సీతను గూర్చి ప్రత్యేక్యంగా కొన్ని మాటలు చెప్పాడు.
" స్త్రీలోకానికి శిరోభూషణం, పతివ్రతాశిరోమణి సీత. ఆమె నిన్ననుసరించి వనవాసానికి వచ్చింది, అందువల్ల, ఆమె నిన్నేది అదిగినా లేదనగూడదు. ఎప్పుడూ నీతోపాటు ఒంటరిగా అడవులలో తిరిగే ఆమె నిన్నేమైనా అడగవచ్చు. రామా ! ఉత్తమురాలైన ఆమె కోరిక తీర్చటమే నీకు యోగ్యంగా భావించు.
సామాన్యమానవులు భార్యను అగౌరవ పరుస్తారు. దంపతులు ఒకరి నొకరు ఆరాధిస్తూ ఉత్తమలోకాలను చేరాలని ఆకాంక్షిస్తారు. ఇక ఆరాధనీయులైన దేవతలు, యజ్ఞాలలో వినబడే వషట్కార స్వాహాకారాలచే ఆహ్వానితులై, గృహిణిని బట్టే ఆ ఇంటి గడప తొక్కుతారు.
స్త్రీ భర్తను అలరిస్తుంది కాబట్టి ఆమె ఆరాధించదగింది. ఆమెలో ఉన్న భార్యాత్వం చేత కూడా ఆమె ఆరాధించదగింది. పతివ్రతాతిలకమైన సీత స్త్రీలోకానికే మణిభూషణం వంటిది. అందువల్ల, ఆమె విశిష్టంగా ఆరాధించదగింది.
పద్మనేత్ర అయిన యీ సుకుమారికి అమాయకంగా ఉండే లేళ్ళు, జింక లంటే చాలా ఇష్టం. లేళ్ళు, జింకలు విస్తారంగా ఉండే అరణ్యప్రాంతానికి ఆమెను తీసుకొచ్చావు. శివధనుర్భంగం చేసిన విక్రమాభిరాముడివి నీవు. ఆమె కోరికను తీర్చటానికి నీకు శౌర్యం చాలదా? లేక నీకు ప్రాణాధికమైన జానకి ప్రేమ చాలదా? "
ఇవీ అగస్త్యుడు చెప్పిన మాటలు. మహర్షులు త్రికాలవేదులు. అందునా అగస్త్యుడు జగత్కళ్యాణం కోసం తన జీవితాన్ని వెచ్చించినవాడు. అందుచేత, భవిష్యత్కార్యాలన్నీ ఆయనకు అవగతమే. రావణుడు జంగమ వేషంలో సీతాపహరణం కోసం వస్తాడని, మాయలేడిగా మారీచుడు సీతను ఆకర్షిస్తాడని, ఆ ద్రష్టకు తెలుసు. ఆ కారణంగానే, అగస్త్య మహర్షి జరుగబోయే సంఘటనను దృష్టిలో ఉంచుకొని అన్యాపదేశంగా రామునికి కార్యాచరణను నిర్దేశించాడు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.
No comments:
Post a Comment