Friday 11 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 760 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము)

దిమ్ము ఘటిల్లునట్లు పదిదిక్కులఁ గౌగిట వేసికొంచుఁ జూ 
ర్ణమ్ముగఁ జేయఁ గల్గునొ యనం జను బాహవ పాటవంబుతో 
నిమ్ముగ నిద్రపోవునపుడేనియు వీడు భయంకరుండు

బ్రమ్ముగ సుందరుండును బ్రబంధ సమాహిత దేహయష్టిమై.

వానిఁగన్న పారవశ్యంబు సడలిన 
యంత హనుమ కనియె ప్రాంతశయ్య
శయ్యయందు సర్వ సౌందర్యమును బ్రోవు
చేసి బొమ్మఁగాగఁ జేసి రనగ.

 అతని యూహలోన నందమన్నను జూచి
నంతలోన శీల మవఘళించు
వినయ మొప్పు నంగవిన్యాసవైఖరి 

తల్లిభావ మెచట తాండవించు.

జలజములున్ నిశాకరుడు సంపెగపూవు కిసాలయంబు దొం
డలు నవశంఖమున్ గమలనాళము లీదృశసర్వమైన పొ
ల్పులు సరిపోవగా శిఖరభూత మచంచల భావసూచి మం
జులమగు నొక్కరేఖ పొడసూపవలెన్ దరుణీ తనూలతన్.

అది సతి జన్మకున్ మొదలిప్రాణము నాల్గగు ధర్మవర్ణ సం
పద కుదు రాత్మధర్మ పరిపాలక మద్ది సనాతనంబు
య్యది కృతమైన కాలమున కాదినిదానము నచ్చమైన యా
మొదలిఁటి తల్లిలక్షణము పొల్చు జగజ్జననీ స్వరూపమై.

హనుమ లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్న సమయంలో  నిద్రిస్తున్న రావణుడిని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడుహనుమ మనసులో ఇలా అనుకొన్నాడు.

" చూసినవాడి తల దిమ్మెక్కేటట్లుగా, పది  దిక్కులనూ కౌగిట్లో బిగించి పిండి చేయగలడన్నట్లున్న  విశాలమైన (ఇరువది) చేతులతో, నిద్రపోతున్నప్పుడు కూడా అతి భయంకరంగా కనపడుతున్నాడు రావణుడుకానీ, ఆశ్చర్యంగా,   కావ్యములలో వర్ణించినట్లు చక్కగా సరిపోయినట్లున్న దేహప్రమాణంతో చూడటానికి అందంగా ఉన్నాడు.

రావణుడిని మొదటిసారి చూసిన పారవశ్యం నుంచి తేరుకొన్న హనుమ, అక్కడ ఒక మంచం చూశాడు మంచం మీద, సౌదర్యాన్నంతా పోగుచేసి బొమ్మను తయారుచేశారా అన్నట్లున్న ఒక స్త్రీని చూసాడు.

హనుమ ఊహలో అందమంటే చూడగానే కొట్టొచ్చినట్లు కనపడే శీలంవినయం ఉట్టిపడే శరీరావయవముల కదలికను బట్టి, యెక్కడ మాతృభావన తాడవిస్తుందో, వానిని బట్టి, అక్కడ నిజమైన సౌందర్యం భాసిస్తుందని హనుమ భావన.

తామరపూవుల వంటి కళ్ళు, నిండు చంద్రుని వంటి ముఖము, సంపెంగ వంటి ముక్కుచిగురుటాకులవలె నునుపైన చెక్కిళ్ళు, దొండ పండ్ల వంటి పెదవులు, శంఖం వంటి కంఠం, తామరతూడుల వంటి చేతులు - యీ రకమైన పోలికలు సరిపోయి, అన్నిటికంటె మకుటాయమైనటువంటిది, అచంచలమైన భావాన్ని సూచించేది, మంజులమైన, దివ్యమైన ఒక భావన, స్త్రీగత తనూసౌందర్యంలో భాసించాలిఅదే మాతృభావనఅదే నిజమైన సౌందర్యం

స్త్రీ జన్మ  కది ఆయువుపట్టు. నాలుగు వర్ణాలతో కూడి ఉన్న మానవధర్మానికి అది పాదు వంటిది. అది యెవరికి వారుగా పాటించవలసినది. అది సనాతనమయినదికృతయుగంలో నాలుగు పాదాల ధర్మం నడవటానికి అదే ఆధారం.   స్వచ్ఛమైనటువంటిది, సృష్టికి ఆధారభూతమైనటువంటిది అయిన మాతృభావన జగజ్జనని రూపంగా భాసిల్లుతుంది. "

భారతీయమైన సనాతనధర్మం, స్త్రీని మాతృస్వరూపంగా భావిస్తుందితైత్తరీయోపనిషత్తు " మాతృదేవోభవ " అని మాతృస్వరూపానికి పెద్దపీట వేసింది. భాగవతం, అన్యస్త్రీ లెవరైనా ఎదురుగా వస్తే, ప్రహ్లాదుడు మాతృభావంతో, తలవంచుకొని ప్రక్కకు తొలగి పోయేవాడని చెప్పింది. ఇది అనాది నుంచి వస్తున్న భావన. హనుమ ఉద్దేశ్యంలో స్త్రీగత సౌందర్యమంతా ఆమె శీలం లోను, తల్లిలక్షణం లోను ఉన్నదని ఘంటాపథంగా చెప్పాడు.

లలితాసహస్రనామాల్లోను జగన్మాతను ప్రప్రథమంగా " శ్రీమాత " అని వర్ణించటం చూస్తే, స్త్రీ యొక్క ఔన్నత్యం, దానిని భాసమానం చేసిన సనాతనధర్మం యొక్క విశిష్టత తేటతెల్లమౌతుంది.  

సర్వ శాస్త్రముల ఆధారంగా కూడా, స్త్రీతనూగత  సమాహిత  సౌందర్యంతో పాటు, దానికి వన్నె తెస్తూ, మాతృభావన అనే శీలసంపదతో, స్త్రీ సర్వజనసంపూజ్య అవుతుందనేది నిర్వివాదాంశం

" శ్రీమాత " అన్న మాతృభావనతో మొదలైన లలితాసహస్రనామాల  వర్ణనలో అమ్మవారిని సగుణాకారిణిగా వర్ణించడం జరిగిందిఉదాహరణకు, అమ్మవారి నాసిక సంపెంగపూవు వలె నున్నదని (నవచంపక పుష్పాభ నాసాదండవిరాజితా), పెదవులు పగడపు, దొండపండు యొక్క ఎఱ్ఱదనాన్ని మించి అతిశయిస్తునాయని వర్ణించబడింది. సీతామహాదేవి సాక్షాన్మహేశ్వరీ స్వరూపం

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.














1 comment:

  1. Slot Machines Near You (JTM) - Jackson County Chamber of
    Search 오산 출장마사지 our map of gambling at the casino, and see what it's like to be 광주광역 출장샵 at it. 용인 출장샵 Click to find out where 동해 출장안마 to go for slots, jackpots, 제주도 출장마사지

    ReplyDelete

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like