దశరథరాజు నీదగు సుతత్వము చేత దరించెనోయి యో
యి శమితకామ ! ధర్మపథహిండన సూక్ష్మ రహస్యవేది ! ధీ
విశద సమస్త ధర్మపదవీ ! యన నమ్ముని రాము డిట్లనెన్
దశరథరాజు నాదగు సుతత్వము చేతఁ దరింపనేటికిన్.
తనకున్ బ్రాణములోన ప్రాణమగుఁ బుత్రస్రష్టయై పూర్వమి
చ్చినమాటన్ నువుగింజయంత బెసగన్ జేకోని చిత్తంబె చా
లును దానౌచుఁ దరింప నా నృపుని పల్కున్ నేను పాలించుచుం
డిన నా ధర్మము నేను చేయుట యగున్ నిర్వ్యాజప్రేమాకృతీ !
అగస్త్య మహర్షి సీతారాముల అన్యోన్య దాంపత్యాన్ని చూసి ముచ్చటపడ్డాడు. వారు కూడా అగస్త్యాశ్రమంలో ఉన్నప్పుడు దశరథుని ఇంటిలో ఉన్నట్లే అనుభూతిని పొందారు. మహర్షి మాటల మధ్యలో, శ్రీరాముడి ధర్మబుద్ధిని గురించి ఇలా పొగిడాడు.
" రామాచంద్రా! నీవు ధర్మమార్గాన్ని వ్యాప్తిచెందించటంలోని సూక్ష్మమైన రహస్యాలు తెలిసినవాడివి. అంతేకాదు ఆ ధర్మసూక్ష్మాలను చక్కగా తెలియపర్చగలిగిన ధీశాలివి కూడాను. దశరథరాజు నిన్ను పుత్రుడుగా పొందటం వల్ల కృతార్థుడయ్యాడు. "
దానికి రాముడు వినయంగా ఇలా బదులిచ్చాడు.
" నిర్వ్యాజమగు ప్రేమమూర్తియైన ఓ మహర్షీ ! దశరథరాజు నేను కొడుకు నవటం వల్ల తరించటం దేనికి? ఆయనకు కొడుకంటే ప్రాణానికి ప్రాణమయినా కూడా, ఇచ్చినమాటను నువ్వుగింజంతయినా తప్పకుండా నిలబెట్టుకొనే స్థిరచిత్త మొక్కటి చాలు ఆయన తరించటానికి. నేను రాజు మాటను పాలిస్తున్నానంటే అది కేవలం నా ధర్మాన్ని నేను చేస్తున్నాను, అంతే. "
విశ్వనాథవారి సంబోధనలు సన్నివేశానికి తగ్గట్లుగా ఉంటాయి. శ్రీరాముడిని సన్నివేశానికి తగ్గట్లు " ధర్మపథహిండన సూక్ష్మ రహస్యవేది ! , ధీ విశద సమస్త ధర్మపదవీ, " అని అగస్తుడు సంబోధించగా, రాముడు మహర్షిని " నిర్వ్యాజప్రేమాకృతీ ! " అన్నాడు. అనగా, మునికి రాముని పై గల మిక్కుటమైన ప్రేమతో అలా మాట్లాడుతున్నాడు గానీ, దశరథుడు తనకు తానుగా సత్యవాక్పరిపాలకుడు, ధర్మమూర్తి అని రాముని తిరుగులేని భావన.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.
No comments:
Post a Comment