జీబులల్లిన వనీసీమలోఁ బులుల సింగముల కాల్జాడలు గాంచినపుడు
కొండలపై నుండి కురిసెడు సెలయేళ్ళ సోనజల్లులవాక చూచినపుడు
అలపైని గొండకొమ్ములు తెల్లమబ్బులు క్రమ్మిపోయెడు వేళఁగనినయపుడు
ఒకపెనుగాలి యుఱ్ఱూత లూగించుచో గళవళంపడు కానఁ గాంచినపుడు
భీతి పుట్టిననైనను భీతిలోనఁ
బ్రీతి తెలియకయును విడంబించు గాదె !
యచ్చముగఁ జెడ్డవస్తు వీ యవనిఁ గలదె?
మించి సర్వము సుఖదుఃఖమిశ్రితంబె.
కలువపూమోము రాఘవ ! నీది వాడిన చల్లని కరములఁ జూడఁగలను
తమ్మిపూవంటి పాదము నీది నొచ్చినఁ దరణిబాష్పంబుల విరియఁగలను
సంపెఁగవోని నీ స్వాంతమ్ము గుఱుతించి షట్పదదూరంబు సాగఁగలను
చేమంతివోని నీ చేతఃప్రసన్నత శిశిర, మంజులత స్పృశింపఁగలను
ఏట మున్గువానిని లేవనెత్తబోవఁ
గాళ్ళకడ్డమ్ము తిరిగి రక్షకుని ప్రాణ
ములకుఁ దెచ్చెడి మూఢుని పోల్కి గాను
తక్కినవి యౌదుగాను, సంస్థాస్వరూప !
సీత రామునితో పాటు వనవాసం చేయటానికి అనుమతి కోరుతూ, అడవితల్లి అంటే తనకెంత ఇష్టమో, అక్కడ రాముని కేవిధమైన సపర్యలు చేయదలిచిందో చెప్పింది.
" దట్టంగా ఉన్న అడవిలో, పులుల యొక్క, సింహాల యొక్క కాలిజాడలు కనిపించినపుడు, కొండలపై నుండి క్రిందికి జాలువారే సెలయేళ్ళ నీటిధారల అందం చూసినపుడు, ఎత్తుగా ఉన్న కొండకొమ్ములను రాసుకొంటూ తెల్లని మబ్బులు క్రమ్ముకొన్న సమయాన ఆ దృశ్యాన్ని చూసినపుడు, పెనుగాలి ఉద్ధృతంగా వీచినపుడు, కళవళపడిపోయిన అరణ్యాన్ని చూసినపుడు, మనస్సులో భయం కలిగినా కూడా, ఏదో తెలియని ఇష్టం పుట్టుకొస్తుంది. ఈ ప్రపంచంలో అచ్చంగా చెడ్డవస్తువంటూ ఏమన్నా ఉందా? అంతా సుఖాదుఃఖాలతో కూడుకొని ఉన్నదే కదా !
రామా ! కలువపువ్వు వంటి నీ ముఖం వాడిపోయినపుడు చల్లని కరస్పర్శతో నిన్ను సేదదీర్చగలను. తమ్మిపూవు వంటి నీ సుకుమారమైన పాదాలు నొప్పిపుట్టినప్పుడు, వెచ్చని నా కన్నీటితో బడలిక పోగొట్టగలను. సంపెంగపూవు వంటి నీ ఏకాంతానికి భంగం కలుగకుండా, తుమ్మెదలాగా (ఆరడుగుల) దూరాన్ని పాటించగలను. చేమంతిపూవు వంటి నీ మనఃప్రసన్నతను శిశిర ఋతువు నందలి మెత్తదనంతో స్పృశింపగలను. అయ్యో ! పాపమని నన్ను నీతో తీసుకువెళ్ళిన నేరానికి, ఏటిలో మునిగిపోతున్నవాడిని రక్షించటానికి వెళ్ళిన వాడి కాళ్ళు పట్టుకొని, రక్షకుని ప్రాణాలు తీసేటటువంటి మూర్ఖురాలి వంటి దానిని కాదు. ఇంకే విధంగాను కూడా నీకు ఇబ్బంది కలిగించను. "
సీత ప్రకృతి స్వరూపిణి. అందుచేత, ప్రకృతిలోని సమస్త వృక్ష, జంతు, వస్తుజాలంతో తాదాత్మ్యం చెందుతుంది.
ఇక రెండవ పద్యంలో, రామునికి చేసే సపర్యలను గురించి చెబుతూ, భర్తను ' సంస్థాస్వరూప ! ' అని సంబోధించింది. రాముడు చక్కని వివాహ వ్యవస్థకు, కుటుంబ వ్యవస్థకు, సంఘ వ్యవస్థకు, రాజ్య వ్యవస్థకు, ధర్మ వ్యవస్థకు ప్రతీక.
విశ్వనాథ రాముని అవయవసంపదను పువ్వులతో పోలిక తెచ్చిన తీరు, అత్యంత రమణీయం. కలువ చంద్రుని చల్లని కిరణాలతో వికసిస్తుంది. తమ్మిపూవు అతి సుకుమారమైనది. అది హేమంతంలోని మంచుబిందువులతో స్వచ్చంగా ఉంటుంది. షట్పద అంటే తుమ్మెద. తుమ్మెద అన్ని పువ్వుల మీద వ్రాలుతుంది ఒక్క సంపెంగ తప్ప. దూరాన్ని పాటిస్తుంది. చేమంతులు శిశిరంలో విరియబూస్తాయి. చేమంతి మెత్తదనానికి ప్రతీక. శిశిరంలో చెట్లు మారాకులు తొడుగుతాయి. మనస్సు యొక్క ప్రశాంతభావం చిగురుటాకుల మెత్తదనంతో పోల్చబడింది. ఈ విధంగా విశ్వనాథ వర్ణనలు కథలో అంతర్భాగంగా ఉండి, సహజ సుందరంగా భాసిల్లుతాయి.
ఈ రెండు సీస పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, ప్రస్తాన ఖండము లోనివి.
No comments:
Post a Comment