ఎవరయ్యా ! రఘురామచంద్రులకుఁ గానీ యస్త్రవిద్యాగురుల్
నవ బాహాపటుదీర్ఘదండునకు నీ నా వద్ద శిష్యత్వ మొ
ప్పవలెన్ శ్రీరఘురాము బాహుపటిమల్ ప్రాశస్త్యమందన్ వలెన్
వివృతంబుల్ మునికోటియజ్ఞతతి నిర్విఘ్నత్వ మొప్పన్ వలెన్.
మొనసి భృశాశ్వదత్తములు మూల్గుచునున్నవి నాకడన్ మహా
స్త్ర నిభృత విద్యలట్లె రఘురామునకై యవి యెల్ల నిచ్చెదన్
మనుజమహేంద్ర ! పంపుము కుమారుని నా వెనువెంట నూరకే
యనలము దాచుకొన్న ఫలమా? క్రతుయోగ్యము కావలెం జుమీ !
విశ్వామిత్ర మహర్షి దశరథుని దగ్గరకు వచ్చాడు. మునీశ్వరుణ్ణి అర్ఘ్యపాద్యాలతో సముచితంగా పూజించిన తరువాత, దశరథుడు విశ్వామితుడిని ఏది కావాలంటే అది కోరుకొమ్మన్నాడు. సంతుష్టాంతరంగుడైన మహర్షి దశరథునితో ఇలా అన్నాడు.
" ఎవరయ్యా రామునికి అస్త్ర విద్య నేర్పుతున్న గురువు? ఇప్పుడే యవ్వనంలో అడుగుపెడుతున్న యీ ఆజానుబాహుడు నా దగ్గర గానీ లేకపోతే వశిష్ఠుని దగ్గర గానీ శిష్యరికం చేయాలి. దానివలన, రామచంద్రుని యొక్క బాహుబలపరాక్రమాలు ప్రసిద్ధి వహించాలి. మునుల యొక్క యజ్ఞయాగాదులు నిర్విఘ్నంగా కొనసాగాలి.
భృశాశ్వుడిచ్చిన అస్త్రసంపద ఎప్పటినుంచో నా దగ్గర నిరుపయోగంగా పడి ఉంది. ఇక నేను తపస్సు చేసి పొందిన మహాస్త్రసంపద కూడా అంతే. రాజేంద్రా ! అవన్నీ రామునికి ఇస్తాను. నీ కుమారుణ్ణి నాతో పంపించు. అగ్నిని దాచుకొంటే ఏమన్నా ప్రయోజనం ఉందా? అది యజ్ఞార్థం కావాలి సుమా ! "
భృశాశ్వుడు ఒక ప్రజాపతి. దక్షప్రజాపతి కుమార్తెలైన జయ, సుప్రధ అనే వారిని వివాహమాడి ఎందరో పుత్రులను పొందాడు. వారందరూ అస్త్రము లయ్యారు. తదనంతర కాలంలో, విశ్వామిత్రుడు వాటిని పొందాడు.
" అనలము దాచుకొన్న ఫలమా? క్రతుయోగ్యము కావలెం జుమీ ! " ఛందోబద్ధం చేసి ఎంత చక్కని సూక్తిని అందించారు విశ్వనాథ.
అగ్ని అతి పవిత్రమైనది. అగ్ని చేత శుద్ధి చేయబడనిదేదీ లేదు. అటువంటి అగ్ని క్రతుయోగ్యం కావాలి. అప్పుడే జగత్కళ్యాణం సిద్ధిస్తుంది. అలాగే, మానవుడు చేసే ప్రతి పని యజ్ఞార్థం కావాలి. అప్పుడే సర్వమానవ శ్రేయస్సు ఒనగూరుతుంది.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అహల్యా ఖండము లోనివి.
No comments:
Post a Comment