ఆహా ! యెంతటి సౌమ్యమూర్తి ప్రవిలోకానంద పర్యాప్తమౌ
దేహచ్ఛాయయుఁ జంద్రమో విమలసందీప్తాస్య మంభోరుహ
స్నేహం బొప్పెడు నేత్రయుగ్మము మఱి న్నిర్వ్యాజసౌందర్యమున్
దేహాతీత మచింత్యవైభవ మహోదివ్యప్రభారేఖయున్.
మహాయోధుడు వాలి రాముని బాణానికి నేలగూలాడు. రాముడు, లక్ష్మణునితో పాటు అతడిని సమీపించాడు. వాలి తీక్ష్ణమైన చూపులతో రాముణ్ణి చూసి, తల ప్రక్కకు తిప్పుకొని, నిట్టూర్చి, ఉస్సురంటూ, తనలోననుకొంటున్నట్లుగా ఇలా అన్నాడు.
" ఆహా ! ఎంతటి సౌమ్యమైన ఆకారం ! మాటిమాటికీ చూడాలనిపించే దేహకాంతి. చంద్రుడు , అలాగే పద్మహితుడైన సూర్యుడు అన్నట్లున్న నేత్రాలు. వంకబెట్టలేని సౌందర్యం. దేహాతీతమైనటువంటి, ఊహకందనటువంటి, వైభవోపేతమైన దివ్యకాంతిరేఖలు. "
వాలి దేవతాంశతో జన్మించినవాడు. ఇంద్రుని కుమారుడు. రాముని శరాఘాతంతో, అతనిలో గూడుకట్టుకొన్న దైహిక వికారాలు నశించి, దివ్యభావన ఉత్పన్నమయిందా అనిపిస్తుంది. రాముని కళ్ళలోకి తీక్షణంగా చూసిన వాలి తల ప్రక్కకు త్రిప్పుకొన్నాడంటే, సర్వపాపహరమైన ఆ చూపులను తట్టుకొనలేకపోయాడని అర్థమౌతుంది. రాముని యొక్క దివ్యమోహనాకారాన్ని చూడగానే, మానసికంగా ఆశ్చర్యచకితుడైన వాలి మనోగతం అప్రయత్నపూర్వకంగా బహిర్గతమయింది.
చంద్రసూర్యులు విరాట్పురుషుని యొక్క నేత్రాలుగా వేదాలు వర్ణించాయి.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోనిది.
No comments:
Post a Comment