యెఱుగనట్టివారి నెఱుగు టెట్లు
అవనిజాత నెఱుగనను టెట్లు పొసగునో
యింత రామచంద్రు నెఱిగి యెఱిగి.
ఒక్కరిఁ పూర్వమందు వినియుందుము వారి గుణంబులందునన్
మక్కువ కలిగి యుందుమును మానుషమై చను వారి మూర్తి ము
న్నెక్కడఁ జూడ లేదయిన నేమగుఁ జూచిన యట్లెయుండు వా
రిక్కరణిన్ రహింతురని యేదియొ గుండియలో మెలంగెడున్.
వారిని గాంచినప్పటికి వారిని జూచినయట్లె యొప్పెడిన్
వారిని మున్ను చూడకయ వల్లభమూర్తిని భూమిజాత న
వ్వారిగ జూచినంతటన వల్లభమైన మనోoతరాంతర
స్ఫార మనోహరాకృతియు వచ్చి నిలంబడు గంటిముందరన్.
హనుమంతుడు లంకానగరంలో సీతమ్మ కోసం వెతుకుతున్నాడు. పుష్పకంలో దేవతా స్త్రీల వంటి వారిని చూసాడు. తన యొక్క నిశితమైన పరిశీలనా దృష్టి, బుద్ధి విశేషం చేత అందరినీ గమనిస్తూ ముందుకుసాగుతున్నాడు. ఆ పరీక్షా సమయంలో, అతని మనస్సు లోని ఊహలు ఇలా ఉన్నాయి.
" ఇంతకుముందే తెలిసి ఉన్నవారిని గుర్తుపట్టవచ్చు గాని, ఇంతకు ముందెప్పుడూ తెలియని వారిని గుర్తుపట్టడమెలా? పోనీ, సీతాదేవి అసలు తెలియ దనుకొందామా, రామచంద్రమూర్తి ఇంత బాగా తెలిసిన వాడయినప్పుడు, సీతమ్మ తెలియదనటం కుదురుతుందా?
ఒకరిని గురించి పూర్వ మెప్పుడో విని ఉన్నామనుకో. వారి గుణగణాలు కూడా బాగా ఇష్టమనుకో. కానీ, ప్రత్యక్షంగా వాళ్ళెట్లా ఉంటారో చూడలేదనుకో. అంతమాత్రాన ఏమయిపోయింది? మన మనస్సులో వాళ్ళను చూసినట్లే అనిపిస్తుంది. వాళ్ళు ఫలానా విధంగా ఉంటారని, మాట్లాడతారని, వ్యవహరిస్తారని ఏదో గుండె లోపల మెదులుతూ ఉంటుంది.
తీరా వాళ్ళను చూసేటప్పటికి, అంతకు ముందెప్పుడూ చూడకపోయినా, వాళ్ళను చూసినట్లే అనిపిస్తుంది. సీతమ్మ విషయంలో కూడా అంతే. ఆమెను ప్రత్యక్షంగా చూసిన తరువాత కూడా, ఎక్కడో మనస్సు పొరల్లో ఇంతకుముందే ఏర్పరచుకొన్న ఆ మనోజ్ఞ మంజులాకృతి వచ్చి కళ్ళముందు నిల్చున్నట్లుగా అనిపిస్తుంది. "
లోకంలో కొందరి యెడల ఇది జరుగుతూ ఉంటుంది. మనం ఇంతకు ముందెన్నడూ చూడనివారు తారసపడితే, ఇంతకుముందే వారిని చూసినట్లు, వారి రూపురేఖావిలాసాలు, గుణగణాలు, అన్నీ అంతకు ముందు మనం ఊహించుకొన్నట్లే ఉంటాయి. దివ్యప్రకృతి గల వారి యెడల ఇది యదార్థమేమో !
హనుమంతుని విషయ పరిశీలనకు అద్దం పట్టే యీ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.
No comments:
Post a Comment