మ్రాడూర్జస్వల లక్షణాంకితుడునై వ్రాలెన్ దివఃఖండమున్
వీడంబాఱి దృఢోరసుండు నయనావిర్భూత దివ్యార్చిషుం
డీడంబోయిన దేవతామహిమమై హ్రీతాత్మ తేజస్కుడై.
తన పాదధూళి తలఁ దా
ల్చెను బూర్వంబునను నిచటి క్షిత్తిమృత్తామృ
త్తును దానిపుడు తల దా
ల్చెను దేహం బెల్ల దానిచేఁ బిహితముగా.
తాదృశ దుస్థితింబడియుఁ దా నయనంబున రాచఠీవియుం
బోదు, ముఖాంబుజాతమునఁ బుట్టదు దైన్యము, దేహకాంతి మ
ర్యాదయుబాయ, దామరవనాంతర కల్పకశాఖ యొక్కడు
త్పాదిత ఝంఝచేఁ జెదరి వచ్చి ధరిత్రిని బడ్డయట్టులై
పరమేశ్వర నిర్మాల్యము
పురాణ సంతాన రమ్య పుష్పవ్రజమున్
ధరణిం ద్రోసిరొ యనగను
సురరాజసుతుండు వాలి క్షోణిం దోచెన్.
ధరణిం దాకియుఁ బాతకాల కలితోద్యత్కాంతివారంబు వీ
సర బోకుండినయట్టిదౌ గగన నక్షత్రైక ఖండంబునాన్
బరమోదార విచిత్ర భాసుర మహఃపర్యాప్తదేహుండు ది
వ్యరమం బొల్చెన యశ్మకుట్టనవ్రతుండౌ యోగిచందంబునన్.
శ్రీరాముని యొక్క తీవ్రశరాఘాతానికి నేలగూలాడు వాలి. ఆ సందర్భంలో విశ్వనాథ వ్రాసిన పద్యాలను చదివితే, వాలి పాత్రను విశ్వనాథ ఎంత మహోజ్జ్వలంగా తీర్చిదిద్దారో అర్థమౌతుంది.
" విశాలమైన వక్షస్థలంతో, కాంతిమయమైన కన్నులతో, మహాసామ్రాజ్యానికి చక్రవర్తియైనటువంటి లక్షణాలు గల వాడొకడు, శాపగ్రస్తుడై, దైవత్వాన్ని, తేజస్సును కోల్పోయి , లజ్జావిహీనుడై, స్వర్గలోకాన్ని విడిచిపెట్టి యీ భూమిఖండాన వ్రాలాడా అన్నట్లు నేలపై పడి ఉన్నాడు.
ఇంతకుముందు ఇదే మట్టి తన పాదధూళిని తల దాల్చింది. ఇప్పుడో ! శరీరమంతా దుమ్ము, ధూళి అంటుకోగా, తాను ఆ మట్టిలోనే తల వాల్చాడు.
అటువంటి దయనీయమైన స్థితిలో ఉండి కూడా, ఆయన కళ్ళలో రాచఠీవి ఏ మాత్రం తగ్గలేదు. ముఖపద్మంలో దైన్యం కనపడటం లేదు. దేహకాంతి పోలేదు. పెనుగాలికి విరిగిన స్వర్లోక కల్పవృక్షం యొక్క కొమ్మ ఒకటి చెదిరివచ్చి భూమిపై పడ్డదా అన్నట్లు, వాలి నేల మీద పడి ఉన్నాడు.
పరమేశ్వరుని పూజించిన పుష్పాలు నిర్మాల్యంగా మారినపుడు, భూమి మీద పారబోశారా అన్నట్లు, ఇంద్రతనయుడైన వాలి నేల మీద పడి ఉన్నాడు.
ఆకాశం నుండి ఊడిపడ్డ ఒక నక్షత్రఖండం, నేల మీద పడ్డ తరువాత కూడా దాని కాంతిని కోల్పోకుండినట్లు, పరమోదారమైన, విచిత్రమైన దేహకాంతి మరల తిరిగి వచ్చిందా అన్నట్లు, దివ్యమైన కళతో, రాతిని చెక్కే పనిలో నిమగ్నమైన ఉన్న ఒక యోగిపుంగవుని వలె వాలి నేల మీద పడి ఉన్నాడు. "
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోని యీ సన్నివేశాన్ని చదువుతుంటే పఠితల గుండెలు పిండివేసిన భావం కలిగి, ఒక మహాపరాక్రమశాలి, దైవాంశతో పుట్టిన వాడైన వాలికి ఇంతటి దుస్థితి తప్పలేదంటే, సామాన్యజీవుల గతేమిటన్న ప్రశ్న ఉదయించక మానదు.
No comments:
Post a Comment