నబ్బురంబె కొల్వునందుఁ గాంచి
శైవరౌద్రదీప్తిసంయోగ మొలసిన
యట్లు తోచు నాహవార్థి యగుట.
కన్నుల కింత బిట్టుగను గన్పడు నీతని మూర్తి యింత తే
జున్నది యింత చేవ కల దుర్విని శక్తిగలాడు కోర్కులం
దున్నెడి మంటిత్రోవబడి తూలునె? లేదటె మింటి త్రోవ? నే
నెన్నకమున్నె వింటిపయి కేగెడు మత్కరమో విభీషణా !
రామలక్ష్మణులు నాగపాశ బంధ విముక్తులవటం చూసి రావణుడు ఆశ్చర్యపోయాడు. రాముని గూర్చి సంశయం మళ్ళీ మెదడును తొలవటం మొదలుపెట్టింది. కలలో అతడికి మృతులైన రాక్షసవీరులు కనిపించి అతడి మనస్సును ఇంకా చీకాకు పరచటం మొదలుపెట్టారు. చివరకు రావణుడే రథారూఢుడై యుద్ధరంగానికి వెళ్ళాడు.
రావణుని చూడగానే రాముడు ఆశ్చర్యచకితుడయ్యాడు. మండే సూర్యుని కిరణకాంతి నావరించి, మధ్య నున్నటువంటి నీలవర్ణం తిరిగివచ్చి రావణుని దేహాన్ని అలుముకొన్నదా అన్నట్లు, రావణుడు వెలిగిపోతున్నాడని రాము డనుకొన్నాడు. రావణు డింతటి తీక్షణమైన దేహకాంతి కలవాడని తన ఊహకు ఇంతకు ముందెన్నడూ తట్టలేదని తలపోశాడు. రాముడు రావణుడిని గూర్చి ఇంకా ఇలా అనుకొన్నాడు.
" హనుమ ఇతడిని కొలువుకూటంలో చూసి ఆశ్చర్యపోయాడంటే అబ్బుర మేముంది? యుద్ధసన్నద్ధుడై వచ్చాడు కనుక శివుని యొక్క శుభకర తేజం, రౌద్రదీప్తి మిళితమై అతనిలో కనిపిస్తున్నది.
కంటికి యింత స్పష్టంగా కనిపిస్తున్న ఇతని ఆకారం చాలా తీక్షణంగా, పరాక్రమోపేతంగా ఉంది. ఇంతటి శక్తి కలవాడు తుచ్ఛమైన కోరికల వెంటబడి మట్టి దారిలో పోవడమేమిటి? దివ్యమైనటువంటి ఆకాశమార్గం లేదా? విభీషణా! నా చేయి అప్రయత్నంగానే ధనుస్సు మీదకు పోతున్నదోయీ ! "
రాముడు శైవం ఉట్టిపడుతున్న రావణుడిని చూసి మొదట ఆశ్చర్యపడినా, పిదప తుచ్ఛమైన అతడి కామప్రవృత్తిని అసహ్యించుకున్నాడు. " మంటి త్రోవ, మింటి త్రోవ " అన్న రాముని మాటలలో శరీరం అశాశ్వతమని, కోరికలను జయించటం అలౌకికమైన ఆనందాన్నిస్తుందని ధ్వనిస్తున్నది. అందువల్లనే, ధర్మప్రతిష్ఠాపకుడయిన రాముని చేయి అప్రయత్నంగా వింటి పైకి వెళ్ళిందని అర్థం చేసుకోవాలి.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, కుంభకర్ణ ఖండము లోనివి.
No comments:
Post a Comment