నే యుద్ధంబున కేగుటొండె మిగిలెన్ నీవింక నేమందు విం
తై యాశాంకుర మొక్కడున్నయది తానై రాము డన్యాయమున్
జేయం బోడను నమ్మకంబు మఱి యా స్నేహం బికేమై చనున్.
సమరాహూతుడ నౌచు శూరజన భాస్వద్ధర్మముం బుణ్య ము
త్తముం జేయగ నేను పోవుతఱిఁ జింతం బొందుటేలే సకీ !
భ్రమ బేల్పోకుము నొక బొట్టు నిడ నాపై నొట్టు కన్నీటి మొ
త్తములం జేర్చుట వీరపత్నికి నుదాత్తశ్రీకయోగ్యంబగున్.
సుగ్రీవునితో యుద్ధానికి తొందర పడవద్దని తార వాలికి ఎంతగానో చెప్పింది. రాముడు విలుకాడనీ, తాను మల్లయుద్ధవీరుడనీ, అందువల్ల, తామిద్దరి మధ్య యుద్ధం అసంబద్ధమనీ, యుద్ధానికి తావే లేదనీ ,వాలి భార్యను ఊరడించాడు. వాలి ఇంకా ఇలా చెప్పసాగాడు.
" పైన చెప్పినటువంటి ఒకదానికొకటి పొసగని యీ అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తే, నేను యుద్ధానికి వెళ్ళటమొక్కటే మిగిలి ఉందనిపిస్తుంది. నువ్వేమంటావో చెప్పు. అయినా నాకింకా ఒక్క ఆశ మిగిలి ఉంది. అదేమిటంటే, రాముడు అన్యాయం చెయ్యబోడనే నమ్మకం. మరి రామసుగ్రీవుల స్నేహం ఏ మలుపు తీసుకుంటుందో? "
ఇంత చెప్పినా, యుద్ధానికి వెళ్ళటానికే నిశ్చయించుకొన్న భర్తను చూసి, తార, ఉషఃకాలంలో కురిసిన మంచుకు కళతప్పిన సరస్సు వలె, శోకపరితప్తహృదయురాలయింది.
ఆమెను ఓదారుస్తూ, వాలి ఇలా అన్నాడు.
" ప్రియసఖీ ! వీరులకు ధర్మమైనట్టిది, పుణ్యలోకప్రాప్తి కలిగించేది, ఉత్తమమైనట్టిది అయిన సమరానికి ఉద్యుక్తుడనౌతున్న యీ సమయంలో దుఃఖించటం భావ్యమా ? అజ్ఞానంతో గుండె నిబ్బరాన్ని కోల్పోకు. ఇకమీదట ఒక్క కన్నీటిబొట్టు రాల్చినా, నా మీద ఒట్టు. ఈ రకంగా కన్నీరు కార్చటం నీ వంటి వీరపత్నికి, ఉదాత్తభావాలు కల స్త్రీకి, అయోగ్యమైనది సుమా ! "
ఈ పద్యాలకు వ్యాఖ్య వ్రాస్తుంటే దుఃఖం కట్టలు త్రెంచుకొంటున్నది. సగటు మానవుని లాగా, వీరందరూ శాపోపహతులా? లేక ఇంద్రియాలకు కట్టుబడిన విధివంచితులా? విశ్వనాథ చేతిలో ఒక వాలి, ఒక కుంభకర్ణుడు మహోదాత్తతను సంతరించుకొని, గ్రీకు, ఆంగ్ల నాటకాల్లోని విషాదాంత నాయకులను తలపిస్తున్నారు.
మాహావీరుడైన వాలి మాటలు వింటుంటే, ఆ పాత్రను మహాశిల్పియైన విశ్వనాథ ఎంత మహోదాత్తంగా చెక్కదలిచారో అర్థమౌతుంది.
గుండెను పిండివేసే యీ సన్నివేశం, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోనిది.
No comments:
Post a Comment