యోలిన్ వాలి యటంచుఁ జెప్పెదరు, నిన్నూగించి యేడౌ సము
ద్రాలన్ ముంచుచు ముంచు చుప్పుజలముల్ త్రావించ్ నంచందురా
వాలిన్ మించినవాడు వాని కొడుకబ్బా ! యంగదాఖ్యుండగున్.
మనమేమో రాక్షసులము
మనకున్ రాక్షసులుగాగ మసలెదరు కపుల్
దనుజుడనిన శబ్దార్థము
తనదైచను భయదశక్తి తఱిగినయట్టుల్.
రావణుడికి మనసు మనస్సులో లేదు. అసలీ రాము డెవరనేది ఆయనను వేధిస్తున్న ప్రశ్న. అసాధ్యమనుకొన్న నాగపాశాల నుండి రామలక్ష్మణులు విముక్తులవటం ఆయనకు మహాశ్చర్యాన్ని, దానితో పాటు భయాన్ని కలిగించింది. నిద్ర పట్టక మండోదరి సౌధానికి వచ్చి పట్టపురాణితో తన గోడు వెళ్ళబోసుకొన్నాడు. వచ్చీ రానట్లు నిద్ర పట్టినా, ఆ కలతనిద్రలో మృతులైన రాక్షసవీరులు ఒక్కొక్కరుగా ఆయన కళ్ళ ముందు సాక్షాత్కరించి ఆయనతో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది.
ఇప్పుడు వజ్రదంష్ట్రుడనేవాడు ఇలా చెబుతున్నాడు.
" అయ్యా ! నన్ను చూడండి. నేను, వజ్రదంష్ట్రుడిని. పదునైన దంతాలు కలిగినవాడినంటూ, నన్ను రాముడిని చంపమంటూ నీ యంతటి పంపించాడని వెళ్ళాను. ఇక ఆ కోతులు నన్ను పోనిచ్చారా? వాళ్ళొక్కక్కళ్ళు దున్నపోతులు, ఖడ్గమృగాలు, ఏనుగులు, అడవిపందులు, పులులు, సింహాల్లాంటి వాళ్ళు.
వాడొకడున్నాడే ! బండవెధవ. వీలు చాలు లేని శరీరము వాడూను. వాడి పేరదేంటి? వాలి అని చెబుతారు. అదే, నిన్ను ఊగించి, ఊగించి ఏడు సముద్రాల్లో ముంచి, ఉప్పు నీళ్ళు తాగించాడని చెబుతారు. ఆ వాలిని మించినవాడు వాడి కొడుకురా నాయనా! వాడి పేరు అంగదుడట !
మనమేమో రాక్షసులం. చిత్రంగా, ఆ కోతులు మన పాలిట రాక్షసుల్లాగా తయారయ్యారు. రాక్షసుడు అన్న పదంలో ఉన్న ఆ భయంగొలిపే శక్తి తగ్గిపోయినట్లుంది. "
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, కుంభకర్ణ ఖండము లోని యీ పద్యాలు రావణుని అవ్యవస్థిత మనస్సును తెలియజేస్తున్నాయి.
No comments:
Post a Comment