దిగ్వ్యవహార మయ్బె భవదీయ పరాక్తమముం బ్రశస్తియున్
వాగ్వ్యయమేల చేసికొన బాణములున్నవి చాపముండె స
మ్యగ్వ్యవసాయ మొక్కడు శతాధికమౌను బరాక్రమోక్తికిన్
వాగ్వ్యతిరేక మైనదియు వాగ్విదు లెల్లరు మెచ్చునట్టిదిన్.
లక్ష్మణుడు రావణుని ధనుస్సులను ఒకదాని తరువాత ఒకటి విరుగగొట్టాడు. లక్ష్మణుడి పరాక్రమం, అతడు రామునికి రక్షణకవచంలాగా ఉండటం రావణుడి కోపాన్ని పెంచింది. ఆ కోపంలో రావణుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియలేదు. తన అస్త్రాలతో మండించి, వానరులకు వారికి మధ్య నున్న మిత్రత్వాన్ని నాశనం చేస్తాననీ, దానితో రాముడు భూషణాలు లేని రాజవుతాడనీ ఏవేవో పలికాడు. అప్పుడు లక్ష్మణుడు ఇలా అన్నాడు.
" రావణా ! నీ పరాక్రమం, నీ పేరు ప్రతిష్ఠలు పది దిక్కులా తెలిసిందే కదా ! ఊరకే నోరు పారేసుకోవట మెందుకు? నీ చేతిలో ధనుస్సు, బాణాలు ఉన్నాయి. వాటికి పని చెప్పు. పరాక్రమం కలవాడికి పొందికగా మాట్లాడటమనేది నూరురెట్ల బలాన్నిస్తుంది. పొందికగా మాట్లాడటమనేది వ్యర్థమైన మాటలకు వ్యతిరేకమయినది, పండితులు మెచ్చుకొనేది కూడాను. "
లక్ష్మణుడు శేషుని యొక్క అవతారం. శేషుడు భాషాప్రభుత్వం కలవాడు. యోగశాస్త్రాన్ని లోకానికి ప్రసాదించింది శేషుని అవతారమైన పతంజలి. మనుచరిత్రములో పెద్దన, ప్రవరుణ్ణి " భాషాపరశేషభోగి " అని వర్ణించాడు.
" దిగ్వ్యవహారమయ్యె భవదీయ పరాక్రమముం బ్రశస్తియున్ " అనటంలో దిక్పాలకులను వారి వారి వ్యవహారాలు చేసుకొననీయకుండా, అధర్మ ప్రవర్తనతో, వరగర్వంతో చెప్పుచేతల్లో పెట్టుకొన్న నీ పరాక్రమం, కీర్తిప్రతిష్ఠలు తెలుస్తూనే ఉన్నాయిలే ! " అన్న ఎత్తిపొడుపు కూడా ధ్వనిస్తుంది.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, కుంభకర్ణ ఖండము లోనివి.
No comments:
Post a Comment