"పోతన్న తెలుగుల "పుణ్యపేటి అన్నారు విశ్వనాథ. నిజమే. ఆంధ్ర మహాభాగవతములో ఏ స్కంధంలో ఏ పద్యాన్ని వదలివేయగలము. ప్రతి పద్యం భక్తి రసాన్ని చిప్పిలుతూ ఉంటుంది. అటువంటివే మత్స్యావతార ఘట్టంలోని యీ పద్యాలు.
.
తమలో బుట్టు నవిద్య గప్పికొనుడుం దన్మూల సంసార వి
భ్రములై కొందఱు దేలుచుం గలుగుచున్ బల్వెంటలన్ దైవ యో
గమునం దే పరమేశు గొల్చి ఘనులై కైవల్య సంప్రాప్తులై
ప్రమదంబందుదు రట్టి నీవు కరుణం బాలింపు మమ్మీశ్వరా!
ఇది ప్రళయపయోధి మధ్య నావలో సప్తర్షులతో పాటు ప్రయాణిస్తూ, సర్వ నియామకుడైన భగవంతుని కరుణా విశేషాన్ని వర్ణిస్తూ సత్యవ్రతుడు చేసిన స్తుతి.
" ఈశ్వరా! కొందరు తమలో పుట్టిన అజ్ఞానం వల్ల పరమార్థం కనుగొనలేక కలత చెందుతారు. అజ్ఞానానికి మూలము సంసారము. అటువంటి కొందరు అదృష్టం వల్ల పరమాత్ముడవైన నిన్ను సేవించి తరిస్తారు. ఆనంద రూపమైన మోక్షాన్ని పొందుతారు. ఆ రకముగా అందరిని ఆదరించే నీవు మమ్ము కూడా కాపాడు. "
సంసారము అంటే జారిపోయేది. సంసార జీవులకు అజ్ఞానం వల్ల నిశ్చలతత్వం రాదు. నిశ్చలతత్వం వల్ల జీవన్ముక్తి కలుగుతుందని శంకర భగవత్పాదులన్నారు.
కన్నులు గల్గువాడు మఱి కాననివానికి ద్రోవజూపగా
జన్న తెఱంగు మూఢునకు సన్మతి దా గురుడౌట సూర్యుడే
కన్నులుగాగ భూతముల గాంచుచు నుండు రమేశ! మాకు ను
ద్యన్నయమూర్తివై గురువవై యల సద్గతి జాడ జూపవే.
"చూపులేనివానికి కంటిచూపు ఉన్నవాడు త్రోవ చూపుతాడు. అదేవిధంగా, అజ్ఞానికి మంచి బుద్ధి కలిగినవాడు, గురువు రూపంలో సన్మార్గాన్ని బోధిస్తాడు. సూర్యుడే కన్నులుగా కలిగిన నీవు గురుడవై మమ్మల్ని ఉద్ధరించు."
" వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ పరమార్థభూతమై" అంటారు విశ్వనాథ. అట్టి వెలుగును ప్రసాదించే సూర్యుడు జగదక్షి. సూర్యమండలాంతర్గతంగా ఉండే ఆ వెలుగే, జగదక్షియైన శ్రీమహావిష్ణువు.
No comments:
Post a Comment