రమణీయాక్షసరాకృతిం బొలుచు వర్ణశ్రేణి వీణానులా
పముచేతం గరగించి యందు నిజ బింబం బొప్ప నచ్ఛామృత
త్వము నాత్మప్రతిపాదికత్వమును ద ద్వర్ణాళి యం దెల్ల పూ
ర్ణము గావించిన వాణి తిర్మలమహారాయోక్తి బొల్చుం గృపన్.
ఈ పద్యము రామరాజభూషణుని వసుచరిత్రము ప్రథమాశ్వాసము, అవతారికలోనిది. తెలుగు సాహిత్య వినీలాకాశంలో ఎందరో మహాకవులు ఎన్నోవిధాలుగా సరస్వతీదేవిని స్తుతించారు. అయితే, ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, ఈ పద్యములో అచ్చమైన బ్రహ్మస్వరూపాన్ని, ఆత్మప్రతిపాదికత్వాన్ని, అక్షరపంక్తికి అధ్యవసించాడు వసుచరిత్రకారుడు.
అక్షసరము అంటే స్ఫటికమాల. సరస్వతీదేవి తన వీణాగానముచేత, అక్షమాలాకృతిగానున్న వర్ణపంక్తిని (అక్షరపంక్తిని) కరగించి, ఆ రసమునందు తన నీడ ప్రతిబింబింపజేయగా, ఆ వర్ణశ్రేణిలో (అక్షర సమూహము) అచ్చామృతత్వము (అచ్చమైన బ్రహ్మతత్వము), ఆత్మతత్వములో (జీవతత్వము) నిండేటట్లుగ చేసింది. సరస్వతీదేవి నిజరూపము బ్రహ్మతత్వము. ఆ బ్రహ్మతత్వమును, తన వీణాగానముచేత కరగించి రసరూపమున నున్న అక్షసరాకృతిలో ( అక్షరపంక్తిలో) నింపడం వల్ల, ఆ శుద్ధబ్రహ్మతత్వము జీవుని యొక్క వాక్కులో ప్రతిఫలిస్తున్నది. అట్టి వాగ్దేవి కృతిపతియైన తిరుమలరాయని వాక్కులో నిలుచుగాక యని యీ పద్య భావము.
శబ్దబ్రహ్మము, వాగ్రూపి, నాలుగు విధాలుగా - పరా పశ్యంతీ మధ్యమా వైఖరీ అనే రూపాలలో ఉంటుంది. ఈ పరిపూర్ణ వాగ్రూప చైతన్యము నందు, పై మూడు , అనగా, పరా పశ్యంతీ మధ్యమా వాక్స్వరూపములు జీవునిలో అంతర్నిహితముగా భావ రూపంలో ఉంటాయి. అవి అత్యున్నతమైనవై, దైవీసంబంధమైనవిగా ఉంటాయి. చివరదయిన వైఖరీ వాక్కు బహిర్గమవుతూ, మనము మాట్లాడే భాషారూపంగా వెలువడుతున్నది. పరా పశ్యంతీ మధ్యమా వాక్కులు దైవత్వముతో కూడుకొని, పూర్ణచైతన్యమునకు సంబంధించినవి కావున, మిగిలిన ఒక్క వంతైన, వైఖరీ వాక్కు కూడా దైవత్వము కలిగినదే. అందువలన, మనము మాట్లాడే వైఖరీ వాక్కు, అనగా భాష, పరుషంగా లేకుండా, ఇతరులను నొప్పించకుండా , శుద్ధబ్రహ్మతత్వమును ప్రతిబింబించునదై ఉండాలి. లలితాసహస్రనామావళిలో, అమ్మవారి నామములలో, పరా పశ్యంతీ మధ్యమా వైఖరీ నామాలున్నాయి. భాష, సరస్వతి, చదువుల తల్లి. చదువుల పరమార్థం , వెలుగు, జ్ఞానము, సంస్కారము.
No comments:
Post a Comment