పంచభూతములు దివాకరుండును నిశాకరుడు నీ తను సప్తకంబయేని
యీ శరీరంబు నీదే! కన్నువిప్పుట కన్నుమూయుట నీవు కలుగ వెట్లు?
ఏతదధిష్ఠాత యెవ్వడో యజమానుడనిన నీ యష్టమతనువు వాడు
కెరలి నన్నేమి మిగిల్చితి నా సామి! బిట్టు నే నన్న దభిజ్ఞ గాక!
స్వామి! నీదు పారమ్యంబు బడయజాల
దఖిలవిశ్వంబు దాను నీ వయ్యు గూడ
హరిహర బ్రహ్మమయ మయి యర్థచంద్ర
చూడము వెలుంగును నొసంట జూడ లేక.
మానవ శరీరం పంచభూతాత్మికమైనది. అంటే, కణముల సముదాయమైన పదార్థము, నీరు, వేడిమి, గాలి, చోటు అనేటటువంటి వాని సమాహారము. బాహ్యప్రపంచము పృథువ్యాపస్తేజోవాయురాకాశాత్ అనే పైన చెప్పబడిన తత్వముల సమాహారమే. బయట కనిపించే జగత్తుకు సూర్యచంద్రులు వెలుగును ప్రసాదించే రెండు కళ్ళయితే, ఈ బాహ్యప్రపంచాన్ని చూడటానికి సూర్యచంద్రుల వంటి ఉపకరణాలు మానవనేత్రాలు. ఈ ఏడింటిని పరమేశ్వరుని తనుసప్తకమని అంటారు. అప్పుడు మానవదేహము పరమేశ్వరునికి చెందినదే అవుతుంది. అయితే, మనిషి పునరపి జననం, పునరపి మరణం అని జనన మరణ చక్రంలో తిరుగుతూ, కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ, పరమేశ్వరుడు నిత్యుడు, కాలాతీతుడు, అవ్యయుడు. అదట్లాఉంచితే, మానవ శరీరాన్ని చైతన్యవంతము చేసే అధిష్ఠాత, ఆశ్రయస్థానము, యెవ్వరో యజమానుడనినట్లయితే, ఆ యజమాని పరమేశ్వరుని యెనిమిదవ శరీరమే! అందుకనే, పరమేశ్వరుణ్ణి అష్టమూర్తి అంటారు. మానవశరీరం, పరమేశ్వర ప్రసాదితము, పరమేశ్వరాంకితము. అయినప్పుడు, ఈ శరీరము నశించేటంతవరకు, శరీరధారికి తానున్నానన్న ఒక్క గుర్తు తప్పితే, తనకంటూ, తనదంటూ యేమున్నది? త్రిమూర్త్యాత్మకమై, యీ సమస్త విశ్వమును నిండియున్న ఆ చైతన్యము పరమేశ్వరుడే, పరమేశ్వరునిదే అయినా కూడా, ఆ సచ్చిదానంద స్వరూపాన్ని చేరటానికి, స్వస్వరూపజ్ఞానాన్ని పొందటానికి సరియైన స్థానమైన చంద్రశేఖరుని వెలుగును యోగమార్గంలో, కనుబొమల మధ్య, ఆజ్ఞాచక్రములో చూడలేకపోతున్నామని, జీవుని వేదనను తెలియబరుస్తున్నారు విశ్వనాథవారు.
బ్రహ్మాత్మ్యైకసంధానాన్ని సూచించే యీ పద్యము, కవిసమ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారిక లోనిది.
No comments:
Post a Comment