వెఱచినవాని, దైన్యమున వేదుఱు నొందినవాని, నిద్ర మై
మఱచినవాని, సౌఖ్యమున మద్యము ద్రావినవాని, భగ్నుడై
పఱచినవాని, సాధుజడభావమువానిని, గావు మంచు వా
చఱచినవాని, గామినుల జంపుట ధర్మము గాదు, ఫల్గునా !
ఈ పద్యం పోతన రచించిన తెలుగు భాగవతము, ప్రథమ స్కంధములో ఉన్నది.
భయపడినవాడిని, దిగులుతో మతి చెడినవాడిని, ఒళ్ళు తెలియకుండా నిద్రపోయేవాడిని, మద్యపానం చేసి మత్తులో ఉన్నవాడిని, యుద్ధంలో ఓడిపోయి పారిపోయే వాడిని, కదలక మెదలక పడి ఉన్నవాడిని, రక్షించమని వేడుకొన్న వాడిని, ఆడవారిని, చంపటం ధర్మం కాదని కృష్ణుడు అర్జునునకు హితబోధ చేశాడు.
అశ్వథ్థామ నిద్రిస్తున్న ఉపపాండవులను అమానుషంగా చంపుతాడు. శోకిస్తున్న ద్రౌపదిని అనునయించి, అశ్వథ్థామను వధించి తెస్తానని, కృష్ణునితో పాటు బయలుదేరుతాడు అర్జునుడు. ప్రాణభీతితో పరుగెత్తిన అశ్వథ్థామ, నిస్పృహతో, ఉపసంహారము తెలియకపోయినా, బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అతి భీకరంగా వస్తున్న ఆ అస్త్రాన్ని ఉపసంహరించడం కోసం, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని అర్జునుని ఆదేశిస్తాడు కృష్ణుడు. ఆ రెండు అస్త్రాలు ఒకదాన్నొకటి ఎదుర్కొన్న సమయలో, రెంటినీ ఉపసంహరించి, అశ్వథ్థామను బంధించి తెచ్చి, చంపబోతాడు అర్జునుడు. అప్పుడు, శ్రీకృష్ణుడు పైన చెప్పిన విధంగా హితబోధ చేశాడు.
ధర్మానుష్ఠానం చేసే మహాత్ముల చేతలు యీ విధంగా ఉంటాయి. నిద్రావస్థలో ఉన్నవారిని వధించిన శిశుహంతను క్షమించే నైజము ఉత్తమపురుషుల్లోనే ఉంటుంది.
No comments:
Post a Comment