గృహస్థాశ్రమం గొప్పదనాన్ని తెలియజేసే రెండు సీసపద్యాలు ప్రాచీనాంధ్ర సాహిత్యంలో మనకు కనిపిస్తాయి. ఒకటి, మనుచరిత్రములో సిద్ధుని నోట ప్రవరుని కథలో పెద్దన పలికిస్తే, రెండవది కపటవేషధారియైన ఇంద్రుని నోట పలికించాడు అయుత నియుతుల కథలో తెనాలి కవి. ఆ రెండు పద్యాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
కెలకుల నున్న తంగెటిజున్ను గృహమేధి
యజమాను డంకస్థితార్థపేటి
పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు
దొడ్డిబెట్టిన వేల్పుగిడ్డి కాపు
కడ లేని అమృతంపు నడబావి సంసారి
సవిధ మేరునగంబు భవనభర్త
మరుదేశపథమధ్యమప్రప కులపతి
యాకటి కొదవు సస్యము కుటుంబి
బధిరపంగ్వంధ భిక్షుక బ్రహ్మచారి
జటిపరివ్రాజకాతిథిక్షపణ కావ
ధూతకాపాలి కాద్యనాథులకు గాన
భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియె
ఈ పద్యంలో గృహస్థునకు పర్యాయపదాలుగా యజమానుడు, వాస్తవ్యుడు, కాపు, సంసారి, భవనభర్త, కులపతి, కుటుంబి అనేవి వాడారు పెద్దనగారు. గృహస్థు లేకపోతే సంఘ వ్యవస్థ అస్తవ్యస్తమయిపోతుంది. దానికి పెద్ద పట్టికనే ఇచ్చారు పెద్దనగారు తేటగీతిలో. చెవిటివాళ్ళకు, కుంటివాళ్ళకు, గుడ్డివాళ్ళకు, బిచ్చగాళ్ళకు, బ్రహ్మచారులకు, వానప్రస్థులకు, సన్యాసులకు, అతిథి అభ్యాగతులకు, బౌద్ధభిక్షుకులకు, అవధూతలకు, కాపాలికులు మొదలగు పెక్కుమందికి గృహస్థుడే ఆధారము. గృహస్థు అంటే, పెరట్లో ఉన్న తేనెతుట్టెలాంటివాడనీ, తొడమీద పెట్టుకొన్న ధనపు పెట్టె అనీ, దొడ్లోనున్న కల్పవృక్షమనీ, కామధేనువనీ, ఎప్పుడూ నీటితో నిండి ఉండే దిగుడుబావి అనీ, సమీపంలో ఉన్న మేరుపర్వతం లంటివాడనీ, ఎక్కడా నీరు దొరకని మార్గమధ్యంలో చలివేంద్రమనీ, ఆకలిని తీర్చే పైరు వంటిదనీ,..........ఎన్నో పోలికలు చెప్పాడు సీసపద్యం నాలుగు పాదాల్లో. అందువల్ల, గృహస్థాశ్రమానికి ఏ ఇతర ఆశ్రమము సాటిరాదని తెలియచెప్పాడు.
ఇక తెనాలి రామకృష్ణకవి పద్యం చూడండి.
కీలారముననుండి పాలింటికేతేర
బహుధాన్యములు చేల బండి యొరగ
నెడనెడ బెండిండ్లు వడుగులు వొడమ గృ
తార్థులై యర్థించు యర్థు లలర
బరిచారికా కోటి పనిపాటు పాటింప
జుట్టంపు సందడి నెట్టుకొనగ
గ్రామమెంతయు నిజప్రాభవంబున మన
సత్యనిష్టకు దన్ను సాక్షి గోర
నిత్యనైమిత్తికములు నిర్ణిద్రబుద్ధి
నాచరించుచు హరిభుక్త మాత్మభార్య
భక్తి నిడ భుక్తు గొనుచున్ కి ముక్తి గాని
నిదుర వంటిది రాతి వంటిదియు గాదు.
పూర్వం గ్రామీణ ప్రాంతం కళకళలాడుతూ ఉండేది. పశువులపాక నుండి పాలు పిండి ఇంటికి తేవడం, పొలాలలో పంటలు పండించడం, బండ్లకెత్తించడం, ఇళ్ళలో పెళ్ళిళ్ళు, వడుగులు అవ్వడం, అడిగినవారికి లేదనకుండ ఇవ్వడం, వచ్చే పనివాళ్ళు పోయే పనివాళ్ళు, వచ్చే పోయే చుట్టాలు, అందరివాడు అని ఊరంతా మన గురించి గొప్పగా చెప్పుకోవడం, ఫలానావాడు నిజాయతీకి మారు పేరని చెప్పుకోవడం, నిత్యకర్మలు, పండుగలు, పబ్బాలు, వ్రతాలు, శ్రాద్ధ కర్మలు మొదలైన నైమిత్తిక కర్మల నాచరించడం, దేవతార్చన అయినా తరువాత, దేవుడికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని, భార్య భక్తితో వడ్డించగా తృప్తిగా భుజించడం...........ఇవన్నీ ముక్తిమార్గాలు గానీ........సోమరిపోతులాగా నిద్రపోవడం లేకపోతే ఏమీ పట్టనట్లు బెల్లం కొట్టిన రాయి లాగా కూర్చోవడం, సరిగాదు.
ఈ పద్యాలు చదువుతుంటే మళ్ళీ ఒకసారి పుట్టి పెరుగిన పల్లెటూరు వైపుకి దృష్టి మరలి, చిన్ననాటి మరపురాని, మరచిపోలేని రోజులు గుర్తుకొస్తున్నాయి.
No comments:
Post a Comment