నాలుగు మోములన్ నిగమనాదము లుప్పతిలన్ బ్రచండ వా
తూలహతిన్ జనించు రొదతోడి గుహావళి నొప్పు మేరువున్
బోలి పయోజపీఠి మునిముఖ్యులు గొల్వగ వాణిగూడి పే
రోలగమున్న ధాత విభవోజ్వలు జేయుత గృష్ణరాయనిన్.
బ్రహ్మదేవుని నాలుగు ముఖాల నుండి వచ్చే వేదనాదము ఎట్లా ఉన్నదంటే, మేరుపర్వత గుహల నుండి గాలితాకిడి వల్ల వెలువడే మహాధ్వనిలాగా ఉంది. ఆ విధంగా మేరుపర్వతములాగా కనిపిస్తూ ఉండి, మునులు స్తోత్రపాఠాలు పలుకుతుండగా, సరస్వతితో పాటు పద్మాసనుడయియున్న, చతుర్ముఖ బ్రహ్మ, కృష్ణదేవరాయలకు శ్రేయస్సును కలిగించుగాక.
బ్రహ్మను మేరుపర్వతంగాను, పర్వతగుహలను ఆయన ముఖాలుగను, ఆ గుహల నుండి వెలువడే మహాధ్వనిని వేదనాదంగాను చెప్పడము చేత యీ పద్యములో పూర్ణోపమాలంకారము ఉంది.
ఈ పద్యములో వాడిన ' నిగమనాదములు, మేరువున్ బోలి, మునుముఖ్యులు గొల్వగ, వాణిగూడి ' మొదలుగా గల పదబంధములు, బ్రహ్మదేవుని యొక్క ఉత్తమగుణ విశిష్టత్వాన్ని తెలియజేస్తున్నాయి.
అల్లసాని పెద్దనచే రచింపబడిన మనుచరిత్రము అనబడే " స్వారోచిష మనుసంభవము " అనే మహాప్రబంధము పీఠిక లోనిది పై పద్యము.
No comments:
Post a Comment