కంటికి నిద్రవచ్చునె? సుఖంబగునే రతికేళి? జిహ్వకున్
వంటక మిందునే? యితరవైభవముల్ పదివేలు మానసం
బంటునె? మానుషంబు గలయట్టి మనుష్యున కెట్టివానికిన్
గంటకుడైన శాత్రవు డొకండు దనంతటివాడు గల్గినన్.
ఇద్దరిమధ్య స్పర్థ పెరిగి, రోషావేషాలు పెచ్చురిల్లినప్పుడు, ఒకరిమీద ఇంకొకరు పైచేయి సాధించాలనే పట్టుదల పెరిగినపుడు, ప్రత్యర్థులు కంటి నిండా నిద్ర పోకబోవడము, సాంసారిక సుఖం మీద దృష్టి లేకబోవడము, యెంతటి ఇష్టమైన వంటకమైనా రుచింపకబోవడము, ఎన్ని రకాలైన భోగాలయినా మనస్సుకు హత్తుకొనకపోవడము, చాలా సహజము. అందునా, సమానమైన బలాధిక్యములు, స్వాభిమానము గల మనిషి విషయంలో ఇది మరీ లోకసహజము.
మేరు పర్వతము చాలా గొప్పది. ఆ పర్వతము గొప్పదనాన్ని చూసి వింధ్య పర్వతము స్పర్థ వహించింది. వారిద్దరిలో అధికులెవరో అని వింధ్యము నారదుణ్ణి అడిగిన సందర్భము లోనిది యీ పద్యము.
పలు సందర్భాలలో ఉదహరించబడే యీ పద్యము , ఈశ్వరార్చనకళాశీలుడైన శ్రీనాథ కవిసార్వభౌముని కాశీఖండము ప్రథమాశ్వాసము లోనిది.
No comments:
Post a Comment