కృష్ణదేవరాయలు వర్ణనలలో ఆరితేరినవాడు. ఆ వర్ణనలు ఎంత సహజంగా ఉంటాయంటే, మొత్తం దృశ్యం మన కళ్ళకు కట్టినట్లుంటుంది. ఆముక్తమాల్యదలోని యీ వర్ణన చూడండి.
వేవిన మేడపై వలభి వేణిక జంట వహించి విప్పగా
బూవులు గోట మీటు తఱి బోయెడు తేటుల మ్రోత కామి శం
కావహమౌ గృతాభ్యసను లౌటను దంతపు మెట్ల వెంబడిం
జేవడి వీణ మీటుటయు జిక్కెడ లించుటయు న్సరింబడన్.
అప్పుడే తెల్లవారింది. వారయువతులు మేడపై వసారాలోకి వచ్చారు. పొడవైన జడను విప్పి ఏటవాలుగా వక్షస్థలం మీద వేసుకొని, పూలను సుతారంగా గోటితో చిమ్ముతున్నారు. పూలమీద వాలిన తుమ్మెదలు ఎగిరిపోతున్నాయి. ఆ దారిలో పోతున్న కాముకులకు యీ దృశ్యం యెలా కనిపించిందంటే, ఆ వేశ్యలు వీణ మీది దంతపు మెట్లను కొనగోటితో మీటుతున్నారా అని అనిపించిందట. ఆ రోజుల్లో వేశ్యలు వీణ వాయించడంలో ప్రావీణ్యం కలవారు.
వక్షస్థలం మీద ఏటవాలుగా వేసుకొన్న నల్లని జడ వీణగా, పూవులు దంతపు మెట్లుగా, తుమ్మెదల మ్రోత వీణానాదంగా, భ్రాంతిమదాలంకారంలో అద్భుతంగా ఉంటే, ఆ వారకాంతలు పొద్దున్నే మేడపైన వసారాలోకి వచ్చి జడను విప్పడం అతి సహజంగా బాపూగారి బొమ్మ మన ముందు నిల్చినట్లుగా లేదూ!
No comments:
Post a Comment