హరునకు రెండు రెండొకొ గజాజినమున్ దహనాంబకంబు నా
నురువృషభేంద్రు నెక్కుటయు నొందె గటిన్ విపులాభ్రపంక్తి భా
స్కరుడు లలాటపట్టమున గంగయు జంద్రుడు రెండు రెండొ నా
శిరమున బొంది రబ్దపథసింధు సుధాకరు లద్భుతంబుగాన్
శివుడు పార్వతిని పరిణయమాడడానికి ఓషధీప్రస్థపురానికి (హిమవంతుని నగరము) పయనమయ్యాడు. ఆయన తన వాహనమైన వృషభరాజాన్ని అధిరోహించాడు. అప్పుడు ఆయనకు కరిచర్మమును, అగ్నినేత్రమును రెండేసి ఉన్నవాయన్నట్లు, కటిప్రదేశమున మేఘపంక్తి, ఫాలభాగంలో సూర్యుడు విరాజిల్లారు; అదేవిధంగా, గంగ, చంద్రుడు, ఇద్దరిద్దరున్నారా అన్నట్లు శిరస్సున ఆకాశగంగ, సుధాకరుడు విలసిల్లారు.
ఇది అద్బుతమైన రచన. ఇక అంతకంటే ఉన్నతమైనదేదీ లేదని చెప్పాలంటే, పోలిక అంతటి ఉన్నతమైనదయి ఉండాలి. శివుని వాహనమైన వృషభరాజాన్ని అంతకుముందు ఒక సీసపద్యంలో ఉన్నతంగా, అత్యద్భుతంగా వర్ణించాడు నన్నెచోడ మహాకవి. ఆ వృషభరాజాన్నెక్కి వస్తున్న శివుడెంత ఉన్నతంగా వర్ణించబడాలి? అందుకే ఈ ఉత్ప్రేక్ష.
నందీశ్వరునిపైనెక్కిన శివుడు మేఘమండలాన్ని దాటగా, ఆ మేఘపటలము, శివుడు కటిప్రదేశంలో ధరించిన కరిచర్మము ఒకే రకంగా ఉండి, రెండా అన్నట్లున్నాయి. మేఘమండలానికి చాలా ఎత్తులో ప్రకాశించే సూర్యుడు, శివుని ఫాలభాగములోనున్న అగ్నినేత్రము రెండేసి ఉన్నాయా అనిపించింది. అదే రీతిలో, శివుని శిరస్సు ఆకాశము వరకు వ్యాపించుటచే, అతని శిరస్సున అదివరకే యుండిన గంగ కాక మరియొక ఆకాశగంగ, శివుని శిరోభూషణమైన చంద్రుడితో పాటు ఇంకొక సుధాకరుడు, ఉన్నట్లు తోచింది. మొత్తంగా కలిపి చూస్తే, శివుని వాహనమైన వృషభరాజము అంత ఎత్తుగానూ, దానినెక్కి వస్తున్న శివుడంత ఉన్నతుడుగానూ ఉన్నారని భావము.
నన్నెచోడ మహాకవి పదునొకండవ లేదా పన్నెండవ శతాబ్దానికి చెందినవాడు. పదునైదవ శతాబ్దానికి చెందిన బమ్మెర పోతన ఆంధ్రమహాభాగవతములోని వామనావతార ఘట్టంలో, వామనమూర్తి క్రమక్రమంగా ఎట్లా పెరిగిందీ " రవిబింబం బుపమింప పాత్రమగు చ్ఛత్రంబై " అనే పద్యంలో అత్యద్భుతంగా వర్ణించాడు. పోతన గారి వర్ణనకు నన్నెచోడ మహాకవి స్ఫూర్తి అనడం కంటే, ఇద్దరు ప్రతిభామూర్తులైన కవుల చేతిలో ఒకానొక ఊహ ఎంత చక్కగా రూపు దిద్దుకొంటుందనడనికి యీ పద్యాలు నిదర్శనాలు. ఇక రెండవ విషయం. నన్నెచోడుని వర్ణనకు పాత్రుడు శివుడైతే, పోతన గారి వర్ణనకు పాత్రుడు శ్రీమహావిష్ణువు. చైతన్య మొక్కటే, రెండు రూపాలు మన భావనలో. ఇదే శివకేశవ అభేద తత్వం.
No comments:
Post a Comment