మహి ము న్వాగనుశాసనుండు సృజియింపం గుండలీంద్రుడు ద
న్మహనీయస్థితిమూల మై నిలువ శ్రీనాథుండు ప్రోవ న్మహా
మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు వాటించు నీ
బహుళాంధ్రోక్తిమయప్రపంచమున దత్ప్రాగల్భ్య మూహించెదన్.
ఎంత చక్కని పద్యము! రామరాజభూషణుడు రచించిన వసుచరిత్రము ప్రథమాశ్వాసము లోనిది యీ పద్యము. ప్రాచీనాంధ్ర మహాకవులను స్తుతిస్తూ , వారిని వర్ణించిన పద్యము.
ఈ పద్యములో అర్థద్వయము ఉంది. ఒకటి మనము జీవిస్తున్న ప్రపంచము పరంగాను, రెండవది ఆంధ్ర సాహిత్య ప్రపంచ పరంగాను సమన్వయం చేసుకోవాలి. ఈ ప్రపంచాన్ని సరస్వతీశాసనుడైన బ్రహ్మ, బహుళాంధ్రోక్తిమయ ప్రపంచాన్ని ఆదికవి నన్నయ సృష్టించారు. సృష్టింపబడిన యీ ప్రపంచాన్ని కుండలీంద్రుడు, అనగా, ఆదిశేషుడు, సారస్వత ప్రపంచాన్ని సోమయాజియై కుండలాలను ధరించిన తిక్కన, మూలస్తంభాలై భరించారు . ఇక ఈ విశ్వాన్ని శ్రీమహావిష్ణువు, సాహిత్య ప్రపంచాన్ని రసప్రసిద్ధధారాధునియైన శ్రీనాథకవిసార్వభౌముడు రక్షించారు. ఈ దృశ్యమాన జగత్తును మహాతేజోవంతులైన చంద్రుడు, సూర్యుడు, సారస్వత జగత్తును మహామహులైన ఉత్తరహరివంశ కర్త నాచన సోముడు, రామాయణాన్ని రచించిన భాస్కరుడు, ప్రకాశింపజేశారు.
సారస్వతాభిమానుల నోళ్ళలో నానే ఇంత చక్కని, చిక్కని పద్యము తెలుగుజాతికి అందించిన భట్టుమూర్తి మహాకవికి, ఈ పద్యములో స్తుతింపబడిన, పేర్కొనబడని పోతన, పెద్దన, నంది తిమ్మన, కృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణుడు ఇత్యాదిగా గల ప్రాచీనాంధ్ర మహాకవులకు, మన తరంలోని విశ్వనాథ, శ్రీశ్రీ, తుమ్మల, జాషువా, రాయప్రోలు, కృష్ణశాస్త్రి, దాశరధి, సినారె, కాళోజీ వంటి ఎందరో మహానుభావులకు......అందరకూ వందనములు.
No comments:
Post a Comment