కోరి, కబేలాకు, మందగా దోలికొనిపోవుచుండ
దారిప్రక్కనయున్న పచ్చ గడ్డిపై దారాడు పసుల
తీరుగానున్నది జనుల భోగాశ ! తెలివి సర్వమ్ము
చూఱపుచ్చెదవు, శ్రీశైల మల్లికార్జునా మహాలింగ !
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ' విశ్వనాథ మధ్యాక్కరలు ' అనే పది శతకముల గ్రంధము కేంద్ర సాహిత్య అకాడమీ వారి బహుమతి పొందిన గ్రంధము. ఇందులో మొదటి శతకమైన శ్రీ గిరి శతకము లోనిది యీ పద్యము.
సృష్టి మొదలయినప్పటినుంచి, మనుష్యులు పుడుతున్నారు, పుట్టిన ప్రతివాడూ మరణిస్తున్నాడు. ఈ రెంటి మధ్యలో, మనిషి తెలివిలో, వివేకంలో, ఏమీ మార్పు లేకపోగా, భోగాశ మాత్రము పెరుగుతున్నది . ఈ ప్రపంచము ఒక పెద్ద అంగడి వంటిది. అంగడిలో వివిధ రకాలైన వస్తువులుంటాయి. యదార్థంగా అక్కడి వస్తువులకు విలువ లేదు. విలువ లేదు అంటే, అవి అశాశ్వతమని. కానీ, ఈ జనానికి అంగడిలో ఉన్న సరుకుల మీద చెప్పలేనంత భోగాశ ఉంది. భోగాశ అంటే కనుపించిన ప్రతిదీ తనకు కావాలని, అనుభవించాలనే తాపత్రయము. వీళ్ళ భోగాశ ఎట్లా ఉన్నదంటే, పశువులను అమ్మడానికి కబేళాకు (వధ్యశాలకు) తీసుకు వెళ్తుంటే, దారిలో ఉన్న పచ్చగడ్డి మేయడము కోసం తారాడుతున్నట్లుగా ఉంది. అంటే, అంతిమంగా మరణమనేది ఒకటి ఉన్నదని తెలిసినా, స్వస్వరూప జ్ఞానం లేకుండా , తమ పుట్టుకకు సార్థకత యేమిటి అనే తెలివి లేకుండా, పశుప్రాయులై భోగముల మీద నుండి దృష్టి మరల్చ లేనట్టి స్థితిలో ఉన్నారు. ఈ భావాన్నే, విశ్వనాథ వారు తమ ఖండాంత పద్యము " తెలిసిన మూఢులంచు జగతిం గలరే గద ! " అనే దానిలో సృజనాత్మక రీతిలో చెప్పారు. ఆ పద్యము విశేషాలను ఇంకొకసారి ప్రస్తావిస్తాను. ఈ రకమైన భోగాశ కలిగించి, మానవుల తెలివి మొత్తాన్ని కొల్లగొడుతున్నావు గదా అని శ్రీశైల మల్లికార్జునునితో మొరబెట్టుకుంటున్నాడు శతకకారుడు.
మధ్యాక్కర అనే ఛందోప్రక్రియ అంత తొందరగా కవులకు సాధ్యపడదు. ఆదికవి నన్నయ మొదటగా ఒక నాలుగు లేక ఐదు మధ్యాక్కరలను మాత్రము వ్రాసారు. అటువంటి కష్టసాధ్యమైన ఛందోప్రక్రియలో వెయ్యికి పైగా పద్యాలను పది శతకాలుగా వెలువరించిన గాఢప్రతిభుడు విశ్వనాథ. ఇందులోని ఒక్కొక్క శతకము, విశ్వనాథను " సకలోహ వైభవ సనాథునిగా " దర్శింపజేస్తుంది.
No comments:
Post a Comment