సమరము సాహసం బధిక సంపద లమ్మెయి దెచ్చికోలు ప
థ్యమె రిపు లేల కల్గు దురహంకృతి పెంపును నుత్కటంపు గో
పము మగిడింప జాలు నరపాలున కట్లగుటన్ హితంబు సా
మము దనయంతవా డయిన మానవనాథు నెడన్ మహేశ్వరా!
ఈ పద్యము శాంతిపర్వము ద్వితీయాశ్వాసములో, భీష్ముడు ధర్మజునికి రాజనీతిని బోధిస్తున్న సందర్భంలో వస్తుంది. రాజ్యతంత్రంలో, సామ దాన భేద దండోపాయాల గురించి వసుమనుడనే రాజుకి, వామదేవుడు చెప్పిన సామోపాయము ఇందలి విశేషము.
యుద్ధమనేది సాహసంతో కూడుకొనియున్నది. యుద్ధం వల్ల కలిగే సిరిసంపదలు మేలు కలిగించవు. అసలు, అహంకారాన్ని, మితిమీరిన కోపాన్ని తగ్గించుకొనగలిగిన రాజుకు శతృవు లెట్లావుంటారు? అందువలన ఎదుటివాడు, తనంతటి శత్రువు, బలవంతుడైనపుడు, సామోపాయముతో ప్రవర్తించడం శ్రేయస్కరం.
ఆధునిక కాలంలో కూడా, ఈ రాజ్యతంత్రము బాగా పనికొస్తుంది. ప్రతిదేశము అణ్వాయుధాలను సమకూర్చుకొంటున్న ఈ రోజులలో, ఎదుటివాడిని తక్కువ అంచనావేసి, లోకక్షయానికి పాల్పడకూడదు. ఎన్నో న్యూక్లియరు బాంబుల కన్నా శక్తివంతమైన పాశుపతాస్త్రము తన వద్దనున్నా, లోకహితాన్ని కోరి, కురుక్షేత్ర మహాసంగ్రామంలో, అది ఉపయోగించని మహామనీషి అర్జునున కున్నంత విజ్ఞత దేశాధినేతల కుండాలి. అప్పుడే విశ్వశాంతి సమకూరుతుంది.
No comments:
Post a Comment