స్ఫురదరుణాధరోరురుచి బొంది కరంబును రక్తుడై సితే
తరనయనాతిభాతి నసితద్యుతి జెల్వుగ నొంది నిర్మలో
త్కర దరహాసదీధితి సితప్రభ దాల్చి, మహేశ్వరుండు త్రై
పురుషము దానయైనగతి బొల్చె బురాంగన లోలి జూచుచోన్.
ఈ పద్యం నన్నెచోడదేవకృత కుమారసంభవము అష్టమాశ్వాసము లోనిది. శివుడు పార్వతిని పరిణయమాడడానికి ఓషధీప్రస్థపురానికి వచ్చినపుడు, ఆ పురాంగనలు మైమరచిపోయి శివుని చూస్తున్న సందర్భము లోనిది.
పురస్త్రీలు శివుని చూస్తున్నప్పుడు, వారి యెఱ్ఱని క్రింది పెదవి కాంతులు అతని పై బడి, మిక్కిలి యెఱ్ఱని వాడయిన బ్రహ్మగాను, వారి కనుల నల్లని కాంతిచే, విష్ణువుగను, వారి నిర్మలమయిన చిరునవ్వు తెల్లని కాంతిచే మహేశ్వరుడుగను - త్రిమూర్తిత్వమును దాల్చి - ప్రకాశించాడు.
ఈ క్రింది పద్యము ఎఱ్ఱనకృత ఆంధ్రమహాభారతాంతర్గత అరణ్యపర్వ శేషము లోనిది.
స్ఫురదరుణాంశురాగరుచి బొంపిరివోయి నిరస్తనీరదా
వరణము లై దళత్కమలవైభవజృంభణ ముల్లసిల్ల ను
ద్ధురతరహంససారసమధువ్రతనిస్వనముల్ సెలంగగా
గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళ జూడగన్.
శరత్కాలంలో సూర్యోదయ సమయం కన్నుల పండువుగా ఉంటుంది. వర్షకాలపు కారుమేఘాలు తొలగిపోయి, బాలభానుడి అరుణకిరణాలు భూమిపై పడుతుంటాయి. సరోవరాల్లోని పద్మాలు వికసిస్తాయి. హంసలు, బెగ్గురుపిట్టలు, తుమ్మెదలు కమనీయ సంగీతాన్ని వినిపిస్తుంటాయి.
శరత్కాలపు రాత్రులను వర్ణించిన నన్నయగారి "శారదరాత్రులుజ్వలలసత్తర తారకహార పంక్తులన్ " అనే పద్యము నడకలో సాగిన " స్ఫురదరుణాంశురాగరుచి బొంపిరి వోయి " పద్యము, నన్నెచోడుని కుమారసంభవము, అష్టాశ్వాసములోని " స్ఫురదరుణాధరోరురుచి బొంది కరంబును " పద్యము దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. ఎఱ్ఱనకు ముందువాడయిన నన్నెచోడుని కవిత్వపు వెలుగు ప్రబంధపరమేశ్వరుని పైన పడినదా? ఏమో......? కానీ, ఇద్దరు మహాకవుల గంటముల నుండి జాలువారినవి యీ తేనెవాకలు అనడము నిర్వివాదాంశము.
No comments:
Post a Comment