శ్రీ వక్షోజ కురంగనాభ మెదపై జెన్నొంద విశ్వంభరా
దేవిన్ దత్కమలాసమీపమున బ్రీతిన్ నిల్పినాడో యనం
గా వందారు సనందనాది నిజ భక్త శ్రేణికిన్ దోచు రా
జీవాక్షుండు కృతార్థు జేయు శుభదృష్టిన్ గృష్ణరాయాధిపున్.
ఇది అల్లసాని పెద్దనామాత్యుని స్వారోచిష మనుసంభవము అనే ప్రబంధము లోని మొదటి పద్యము. " ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశా వాపి తన్ముఖం " అనే నియమాన్ని పాటించి, ఆశీర్వాదరూపంగా కావ్యారంభాన్ని చేశాడు.
లక్ష్మీదేవిని కౌగలించుకొన్నప్పుడు, ఆమె పాలిండ్ల మీది కస్తూరి శ్రీమహవిష్ణువు ఱొమ్ముకు అంటుకున్నది. అచటికి వచ్చిన సనకసనందనాది భక్తులకు అది శ్రీమహాలక్ష్మితో పాటు భూదేవిని కూడ, విష్ణువు తన ఱొమ్ముపై నిలుపుకొన్నాడా అనిపించింది. అటువంటి, శ్రీమహావిష్ణువు కృష్ణదేవరాయలను కృతార్థుని చేయుగాక అని ఆశీర్వచనం పల్కాడు.
ఈ పద్యంలో పెద్దలు రెండు విశేషాలను తెలియజేశారు. నిత్యబ్రహ్మచారులైన సనకసనందనాదులకు, విష్ణువు ఱొమ్ము మీద అంటుకొన్న కస్తూరి, భూదేవి లాగా కనిపించడం ఎంతో ఔచితీభరితంగా ఉన్నది. రెండవది, తన రాజ్యాన్ని విస్తరింపచేయలనే ఆకాంక్ష కల కృష్ణరాయనికి, మంగళాశాసనముల నందిస్తూ, విష్ణువును లక్ష్మీభూదేవి సమేతుడుగా వర్ణించడం సముచితంగా ఉంది.
ప్రాచీనాంధ్ర సాహిత్యంలో, అవతారికలో సామాన్యంగా ఇటువంటి స్తుతిరూపమైన ప్రసిద్ధి వహించిన పద్యాలు కనబడుతుంటాయి. ఈ పద్యం కూడా నిస్సందేహంగా ఆ కోవకు చెందినదే.
No comments:
Post a Comment