వాయువశంబులై యెగసి వారిధరంబులు మింట గూడుచుం
బాయుచు నుండు కైవడి బ్రపంచము సర్వము గాలతంత్రమై
పాయుచు గూడుచుండు నొక భంగి జరింపదు కాల మన్నియుం
జేయుచు నుండు గాలము విచిత్రము దుస్తర మెట్టివారికిన్.
గాలి వీచినప్పుడు, ఆకాశంలో మేఘాలు చెదరిపోయి, మళ్ళీ కలుస్తూ ఉంటాయి. ఈ ప్రపంచము స్థితి కూడా అంతే. ప్రాణులు పుడుతూ ఉంటాయి, అంతరిస్తూ ఉంటాయి. ప్రపంచము మొత్తం కాలం యొక్క అల్లిక వల్ల కలుస్తూ , విడిపోతూ ఉంటుంది. కాలం ఒక ప్రవాహంలాంటిది. ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు. ఈ విషయంలో మాత్రం జీవికి స్వతంత్రత లేదు. కాలంలో అన్నీ జరిగిపోతూ ఉంటాయి. కాలం చాలా విచిత్రమయినది. కాలప్రభావాన్ని తప్పించుకొనడం ఎవరివల్లా కాదు.
కురుక్షేత్ర సంగ్రామం తరువాత, అంపశయ్య మీద నున్న భీష్ముని కలిసినప్పుడు, ఆ కురుపితామహుడు కాలం యొక్క ప్రభావాన్ని ధర్మరాజునకు తెలియజేసిన పద్యమిది. ఈ పద్యము బమ్మెర పోతరాజు రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతము, ప్రథమ స్కంధము లోనిది.
No comments:
Post a Comment