శ్రీవిల్లిపుత్తూరులోని అరటి తోటల అందాన్ని రాయలవారు వర్ణించిన తీరు చూడండి.
చాల దళంబుగా బృథుల చంపక కీలన బొల్చు బొందు దో
మాలెలనంగ బండి మహి మండలి చీఱుచు వ్రాలి గంధ మూ
ర్చాలస అయిన భృంగ తతి నా దుద కప్పమరంఫలావళు
ల్వ్రీలి గెలల్సుగంధి కదళీవనపంక్తుల నొప్పు నప్పురిన్
శ్రీవిల్లిపుత్తూరు చుట్టూ అరటి తోటలున్నాయి. అరటి చెట్లకు బాగా పండిన పెద్ద పెద్ద అరటి పండ్లున్న గెలలు నేలకు ఆని వ్రేలాడుతున్నాయి. అవి సుగంధాన్ని విరజిమ్ముతున్నాయి. గెలలు నేలకానడం వల్ల చివళ్ళు నల్లగా కనిపిస్తున్నాయి. బంగారు రంగుతో మిసిమిసిలాడుతూ, చివళ్ళు నల్లగా మొనలుదేరి ఊరిచుట్టూ గుండ్రంగా వ్రేలాడుతున్న యీ అరటి గెలలు యెట్లా ఉన్నయంటే, పసుపు పచ్చని సంపంగి పూలను ఆకుపచ్చని ఆకులమధ్య పేర్చి మాల కట్టినట్లుగా ఉన్నది. ఇది ఆధునికులు ఏరియల్ వ్యూ అంటారే అది.
ఆముక్తమాల్యదలో " ఏ మును దాల్చిన మాల్య మిచ్చు నప్పిన్నది రంగమందయిన పెండిలి " కథను యీ పద్యములో సూచించడం ఒకటయితే, రాయలవారి వర్ణన అత్యద్భుతమని ఆచార్య తుమ్మపూడి కోటేశ్వర్ర్రావు గారు వారి సౌందర్య లహరి వ్యాఖ్యానంలో వివరించారు. ఇందులో బాహ్యంగా కనిపించే ప్రకృతి వర్ణనయే గాక, ఆంతరంగా ఉన్న ఆత్మపదార్థ తత్వాన్ని స్పృశించే లక్షణముందంటున్నారు. ఈ ఆంతర తత్వ స్పర్శ వర్ణనమే మనము చెప్పే మిస్టిక్ పొయట్రీ లేక మార్మిక కవిత్వమని ఆచార్యులవారి వ్యాఖ్యానము. కవి ఆకాశంలోకి ఎగిరి అక్కడనుండి క్రిందకు సారించిన దృష్టికి కనిపించిన దృశ్యం ఈ పండిన గెలలున్న అరటితోటలు; స్వామి మెడలోని అలంకారమైన తోమాలగా కనిపించిందని, ఈ భావనా దృశ్యాన్ని పాఠకుడు చూడకపోతే ఈ పద్య సౌందర్యం తెలియదని ఆచార్య తుమ్మపూడి వారంటారు.
No comments:
Post a Comment