Friday 17 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 30. (ఆంధ్రమహాభాగవతము : ప్రథమస్కంధము)

నిను జింతించుచు బాడుచుం బొగడుచున్ నీ దివ్యచారిత్రముల్
వినుచుం జూతురు గాక లోకు లితరాన్వేషంబులం
ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వా
గ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ! విశ్వంభరా!

యాదవులందు పాండుసుతులందు నధీశ్వర! నాకు మోహ వి
చ్ఛేదము సేయవయ్య! ఘనసింధువు జేరెడి గంగభంగి నీ
పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి
త్యాదరవృత్తితో గదియునట్లుగ జేయ గదయ్య! ఈశ్వరా!

శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరాదేవతా
నీకబ్రాహ్మణగోగణార్తిహరణానిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

బమ్మెర పోతరాజు ఆంధ్రీకరించిన మహాభాగవతములో పద్యము చదివినా భక్తిరసస్ఫోరకంగా ఉంటుందిప్రథమస్కంధాంతర్గతమైన కుంతీస్తవములోని యీ మూడు పద్యాలు అటువంటివే పద్యాలకు అర్థము వివరించనక్కరలేదుఅయితే, మాటిమాటికీ బుద్ధి మరుగున పడే సామాన్య మానవులమైన మనకు, జీవిత పరమార్థాన్ని గుర్తుచేసే ఇటువంటి పద్యాలను మననం చేసుకొని, ఉన్నంతలో ఆచరణలో పెట్టి, జీవితానికి ఒక అర్థాన్ని సాధించుకొనవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

ఉత్తరాగర్భాన్ని తన దివ్యమహిమతో పరిరక్షించిన తరువాత, ద్వారకానగరానికి బయలుదేరిన శ్రీకృష్ణపరమాత్మకు, కుంతి తన ఆత్మనివేదన చేసిన ఘట్టమిది.

భవము అంటే పుట్టడము. పుట్టడమనేది ఒక రోగముదీన్ని భవరోగము అంటారు. రోగగ్రస్తుడైనవాడు తప్పకుండా ఔషధం సేవించాలిఅయితే, మామూలు రోగము కాదిదిజనన-మరణ చక్రంలో, కుమ్మరి సారెలో లాగా తిరుగుతూ, నిరంతర దు:ఖానికి, బాధలకు గురయ్యే భయంకరమైన రోగమిదిఇటువంటి రోగానికి మందు ఇవ్వాలంటే, సమర్థుడైన వైద్యుడు ఉండాలి. అటువంటి మహాభిషక్కు పరమేశ్వరుడు. మందు శరణాగతి శరణాగతి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఎవరి పనులను వారు చేసుకుంటూ, ఫలితాన్ని భగవంతుని మీద ఉంచి, పరమాత్మ యందు చిత్తాని లగ్నము చేయడం పని చేయాలంటే మోహవిచ్ఛేదము జరగాలి. నీవు-నేను, నీవారు-నావారు అనే భేదభావము పోయి, హృదయములో ప్రేమతత్వము నెలకొని, విశ్వమంతా పరమేశ్వరస్వరూపంగా కనపడాలిఅప్పుడు, అద్వైతభావన హృదయములో పీటవేసుకొని, సముద్రములో కలిసిపోయిన గంగాజలంలాగా, చిత్తము పరమేశ్వరభావనలో లీనమవుతుందిఅప్పుడు ఏరకంగా అయితే సముద్రజలం నుండి గంగాజలాన్ని వేరుచేయలేని స్థితి వస్తుందో, అదేవిధంగా, బ్రహ్మాత్మానుసంధానం జరుగుతుందిఅప్పుడు జీవుడు తనలో తాను రమిస్తూ ఉంటాడుఅప్పుడు తాను గుడికి వెళ్ళకపోయినా, గుళ్ళో ఉన్న భావనే కలుగుతుందితీర్థయాత్రలు చేయకపోయినా, పవిత్ర తీర్థాలలో మునిగినట్లే ఉంటుందితన దేహమే దేవాలయంగా మారుతుందిజీవుడు దేవుడవుతాడు. అదే ఆనందసిద్ధి, అద్వైతసిద్ధి.

పై మూడు పద్యాలలో కుంతీదేవి కోరుకున్నదదే.   " యాదవులందు బాండుసుతులందు నధీశ్వర ! మోహవిచ్ఛేదము సేయవయ్య ! " అని వేడుకొన్నదిమనం కోరుకోవాల్సిందీ అదే.


తెలుగుజాతికి తమ " గీతామకరందము ", " యోగవాసిష్ఠ రత్నాకరము ", " ఉపనిషద్రత్నాకరముఇత్యాది గ్రంధముల ద్వారానే గాకుండా, ప్రవచనముల ద్వారా, పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో, మానవజీవిత పరమార్థాన్ని తెలియజేసి, ఆధ్యాత్మిక పరిమళాన్ని వెదజల్లినశ్రీశుకబ్రహ్మాశ్రమ వ్యవస్థాపకులు, సిద్ధయోగి, వర్తమానకాలపు వివేకానందులు, శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి దివ్యచరణాలకు సభక్తికముగా నమస్కరిస్తున్నాను.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like