ఆ మందాకిని మౌళి బూని నను నర్ధాంగీకృతం జేసి తౌ
నౌ మేల్మేలని యార్య యల్గ బ్రణతుండై తద్పదాంభోజ యో
గామర్షంబున గంగయు న్మొరయ జూడాభోగ సమ్యక్రియా
సామర్థ్యంబున వేడు శంభుడు కృతిస్వామిన్ కృపం బ్రోవుతన్.
ప్రాచీనాంధ్ర సాహిత్యంలో భట్టుమూర్తి అని ప్రసిద్ధి గాంచిన రామరాజభూషణుని వసుచరిత్రము ఒక అనర్ఘరత్నము, అత్యద్బుతమైన సృష్టి. ఈ కావ్యం ఒక సంగీత సాహిత్యముల మేళవింపు. కావ్యము చాలవరకు శ్లేషార్థ సమన్వితమై భావుకులను రంజింప జేస్తుంది.
పై పద్యం వసుచరిత్రము అవతారికలో శివుణ్ణి స్తుతిస్తూ చెప్పింది. పద్యంలో గంగా పార్వతుల పరంగా వాడిన పదాలు పద్యాన్ని చమత్కారభరితం చేయడమే గాక, పద్యానికి శోభను చేకూర్చాయి. చూడండి.
శివుని జటావనులలో బంధింపబడిన గంగ, పార్వతికి సవతి అని కవులందరూ చమత్కారంగా చెప్పే మాట. ముసలిదైన మందాకినిని (గంగను) నెత్తికెక్కించుకొని, పదహారేళ్ళ పడుచుదాననైన తనకు అర్థశరీరం మాత్రమే ఇచ్చాడని ఆర్య (పార్వతి) కినుక వహించిందట. మందాకినికి రెండు అర్థాలున్నాయి. ఒకటి గంగానది రెండవది ముదుసలిది అని. అట్లాగే, ఆర్య అంటే పార్వతి అని పదునారేండ్ల వయస్సు కలిగినది అని. అందుకని, పార్వతి కోపం పోగొట్టడానికి శివుడు ఆమెకు ప్రణమిల్లాడట. అప్పుడు, నెత్తి మీద నున్న గంగ మొరబెట్టినదట, అంటే కదలబారి ధ్వని చేసింది. తన అయిష్టతను తెలియజెప్పింది. కానీ, ఇద్దరు భార్యల ముద్దుల మగడైన శివుడు బహు నేర్పరి గదా! అందుకని, చెదరిన తన జడలను సవరించుకొనే నెపంతో గంగను ఓదార్చాడట. అటువంటి " చూడాభోగ సమ్యక్రియా సామర్థ్యము " (చెదరిన జడలను సవరించుకొనెడి నేర్పు కలిగిన) శంభుడు కృతిపతిని రక్షించుగాక అని ఆశీర్వచనము.
ఇప్పుడు మళ్ళీ పద్యాన్ని చదవండి. కావ్యానందం అంటే ఏమిటో తెలుస్తుంది.
No comments:
Post a Comment