పొలతుల్ గౌగిట గ్రుచ్చి యెత్తి తలబ్రా ల్వోయించు నవ్వేళ నౌ
దల గంగం దన నీడ దాన కని మౌగ్థ్యం బొప్ప వేఱొక్క తొ
య్యలియంచుం న్మది నెంచు పార్వతి యసూయావాప్తికి న్నవ్వు క్రొ
న్నెలపూదాలుపు కృష్ణరాయనికి సంధించు న్మహైశ్వర్యముల్.
ముక్కు తిమ్మనార్యు ముద్దుపలుకు అని ప్రసిద్ధి. పారిజాతాపహరణము అనే కావ్యాన్ని వ్రాసిన గ్రంథకర్త అసలు పేరు నంది తిమ్మన.
ఈ పద్యం కావ్యం మొదట్లోనే అవతారికలో వస్తుంది.
పార్వతీపరమేశ్వరుల పరిణయ వేళ ఒకరిపై నొకరు తలంబ్రాలు పోసుకొనే సందర్భాన్ని వర్ణిస్తూ చేసిన శివస్తుతి యిది.
పార్వతీపరమేశ్వరులు ఎదురెదురుగా పెళ్ళిపీటల మీద కూర్చున్నారు. తలంబ్రాలు పోసుకొనే వేళ అయింది. నవవధువు కనుక పార్వతి సిగ్గు పడుతూ ఉంది. ప్రక్కనున్న చెలికత్తెలు, ఆమెను కౌగిటలో ఎత్తిపట్టి, తలంబ్రాలు పోయించారు. అప్పుడు, శివుని జటాజూటంలో ఉన్న గంగానదిలో తన ప్రతిబింబాన్ని చూసి, ఇంకొక ఆమె అని అసూయపడిందట పార్వతి. ఈ మొత్తం సన్నివేశాన్ని చూసి శివుడు (" క్రొన్నెలపూదాలుపు -బాలచంద్రమౌళి) నవ్వాడట. అటువంటి చంద్రశేఖరుడు కృష్ణరాయనికి మహదైశ్వర్యములిచ్చు గాక యని ఆశీర్వచనము.
ఇంకొక విషయము. ఈ పద్యంలో భావికథార్థ సూచన చేశాడు నంది తిమ్మన. రుక్మిణికి పారిజాత పుష్పం ఇచ్చిన ఉదంతాన్ని చెలికత్తె వలన తెలుసుకున్న సత్యభామ అసూయాగ్రస్తురాలవడము, ప్రబంధానికి మూలమైన పారిజాత పుష్పాన్ని " క్రొన్నెల పూదాలుపు " అన్న సమాసములో " క్రొన్నెల పూవు " అనే పదబంధము ద్వారా సూచించడము గమనింపదగ్గవి.
చివరగా, తెలుగువారి సంప్రదాయ పద్ధతిలో, తలంబ్రాలు పోసుకొన్న పార్వతీపరమేశ్వరుల వివాహం ముచ్చటగా ఉంది గదా!
No comments:
Post a Comment