కొలుతురు మర్త్యు లిష్టములు గోరి శిలామయ దేవసంఘమున్
జలమయ తీర్థసంఘమును సంతతము న్నటు వారు గొల్వగా
వలదనరాదుగాక భవత్పద భక్తులరైన మీ క్రియన్
సొలయక దేవతీర్థములు చూచిన యంతనె కోర్కులిచ్చునే.
ఈ పద్యంలో శ్రీవైష్ణవ సంప్రదాయములో మూలసూత్రమైన భాగవతుల సేవ యొక్క విశిష్టత చెప్పబడింది. శ్రీవైష్ణవులకు అతిథి, అభ్యాగత, భాగవత సేవ చాలా ముఖ్యమైనది. భగవద్భక్తులను సేవించడము భగంతునికి ప్రీతికరమని, అందువలన, యీ మార్గంలో మోక్షధామాన్ని చేరడం చాలా సులభమని వారు ప్రగాఢంగా నమ్ముతారు. ఇదే విషయాన్ని శ్రీకృష్ణదేవరాయలు తమ ప్రబంధము " ఆముక్తమాల్యద " లో విష్ణుచిత్తుని వృత్తాంతంలో విశదపరిచారు.
కుబ్జ గృహాన్ని సందర్శించిన తరువాత, కృష్ణుడు అక్రూరుని ఇంటికి వెళ్తాడు. అక్రూరుడు విష్ణుభక్తుడు. కృష్ణుణ్ణి అనేక విధాలుగా పూజించి, స్తుతించిన అక్రూరుణ్ణి ఉద్దేశించి కృషుడు పలికిన యీ మాటలు వర్తమానకాలంలో అతికినట్లు సరిపోతాయి.
మనిషై పుట్టినవాడికి కోరికలు సహజము. కానీ, వర్తమాన సమాజంలో, యీ కోరికలకు ఒక అంతూపొంతూ లేకపోవడము చూస్తున్నాము. ఆ కోరికలను సిద్ధింపజేసుకొనడానికి, మానవులు అనేకమైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, లెక్కలేనన్ని పుణ్యనదులలో స్నానం చేయడము చూస్తూనే ఉంటాము. ఇక్కడ కృష్ణుడు చెప్పేదేమంటే, భగవద్భక్తుల దర్శనమాత్రం చేతనే ఫలితము లభిస్తుంటే, కోరికలు తీరడము కోసం ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాలను దర్శించడము, పుణ్యనదుల్లో మునగడము అవివేకమే గాక, దానివలన వారి కోరికలు ఫలించడము శుద్ధ అమాయకత్వమని ఢంకా బజాయించి మరీ చెబుతున్నాడు కృష్ణుడు.
ఈ పద్యము ఆంధ్రమహాభాగవతము దశమ స్కంధములో కనబడుతుంది.
No comments:
Post a Comment