ప్రాచీనాంధ్ర సాహిత్యంలో విఘ్నేశ్వరస్తుతి రూపంలో నున్న ప్రసిద్ధమైన పద్యాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి వసుచరిత్రకారుని పద్యము. మహాకవుల ఊహలు, రసజ్ఞులైన పాఠకులకు పలురకాలైన పిండివంటలతో పెట్టిన విందుభోజనము లాంటిది. చూడండి.
దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయంగ్రాహముం
గంతుద్వేషికి గూర్చి శైలజకు దద్గంగాఝరాచాంతి న
త్యంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృ
స్వాతంబు ల్వెలయింప జాలు నిభరాడ్వక్త్రుం బ్రశంసించెదన్.
వినాయకుణ్ణి ఇభరాడ్వక్త్రుడు అనడము ఈ పద్యములో గమనించదగ్గది. ఏనుగులు దంతఘట్టనము చేయడము, తుండముతో నీటిని పీల్చడము, జలమునందు క్రీడించడము చాలా సహజము. ఆ విషయాన్ని తీసుకొని, రామరాజభూషణుడు తన ఊహలను జోడించి, ఈ పద్యానికి ఒక భావస్ఫూర్తిని కలిగించారు.
గజముఖుడైన వినాయకుడు తన కోరతో వెండికొండను కదలించడము వల్ల, శివుడు అప్రయత్నంగా పార్వతిని కౌగలించుకొనడము జరిగింది. ఆ విధంగా వినాయకుడు తండ్రికి ప్రీతిని కలిగించాడు. అంతేగాదు. తండ్రి తలపైనున్న గంగాజలాన్ని పీల్చడం వల్ల, తన తల్లి పార్వతికి అత్యంతమైన సంతోషాన్ని కలిగించాడు. గంగ పార్వతికి సవతి కనుక, తన కొడుకు చేసిన పని ఆమెకు అత్యంతామోదాన్ని కలుగజేసింది. విఘ్నేశ్వరుడు చేసిన పనులు తలిదండ్రులు ఇద్దరకూ సంతోషాన్ని కలుగజేసింది. చివరి చరణములోని " పితృస్వాంతము " అంటే తల్లిదండ్రులు అని " మాతాపితరౌ పితరౌ " అనే నిఘంటువచనము ద్వారా స్పష్టమౌతున్నది. ఈ విధముగా పుత్రధర్మాన్ని నెరవేర్చి తల్లిదండ్రులకు అత్యంతామోదము కలిగించిన గజముఖుడు కృతికర్తకు విఘ్నములు తొలగించు గాక అని వసుచరిత్రకారుడు యీ పద్యాన్ని ముగించాడు.
No comments:
Post a Comment