ఇచ్చ హితాహితంబు గణియింపని గోలవు గాన గానకున్
వచ్చితి గా కయో పథికవర్గము నొంటి జరింప నిచ్చునే
యిచ్చటి అన్యపుష్టచయ మిచ్చటి మత్తమధువ్రజం
బిచ్చటి పల్లవోత్కరము లిచ్చటి పాంసులపంకజావళుల్.
ఈ పద్యము రామరాజభూషణుని వసుచరిత్రము లోనిది. కావ్యము మొత్తంలో కూడా శ్లేష ఉన్నట్లే, ఈ పద్యం కూడా శ్లేషాన్వితమై ఉంటుంది. చూడండి.
వసురాజుమీది విరహముతో, వనంలో ఒంటరిగా తిరుగుతున్న గిరికతో, ఆమె చెలికత్తెలు యీ విధంగా అంటున్నారు.
" అయ్యో! నీ మనస్సులో నీకేది ఇష్టమో, ఏది అనిష్టమో ఎంచుకొనలేని ముద్దరాలవు, యీ విధముగా అడవిలోనికి వస్తే, ఇక్కడ ఉండే కోకిలల సమూహం, పూదేనె కోసం వెంపరలాడే తుమ్మెదలగుంపు, ఈ వనంలోని చిగురుటాకుల గుంపు, ఇక్కడ పుప్పొడితో అంటుకొనియున్న పద్మదళాలు, మొదలైన వాని వలన విరహిణివైన నీకు ఇబ్బంది కలుగుతుంది కదా!
ఈ పద్యంలో ఇంకొక విశేషం ఉంది. ప్రస్తుత సమాజంలో, చిన్నాపెద్ద తేడా లేకుండా ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలకు అద్దం పడుతుందీ పద్యం. భట్టుమూర్తి కాలంలో కూడా సమాజం భిన్నంగా ఉందని అనుకొనడానికి వీలులేదు. కాకపోతే, తీవ్రతలో తేడా ఉండవచ్చు. కాబట్టి, మనిషి మనీషి అవ్వాలంటే, పశువుల లోని (జీవులు) పశుత్వం నశించి, పశుపతి (దేవుడు) పైకి రావాలి.
ఇక రెండవ అర్థము.
"అయ్యో, నీవెంతటి అమాయకురాలివో కదా! నీకేది మంచిదో, యేది మంచిది కాదో కూడా తెలుకొనలేకపోతున్నావు. ఈ వనంలో (లోకంలో), తల్లిదండ్రుల అదుపాజ్ఞలలో లేకుండా, ఇష్టారాజ్యంగా తిరిగే ధూర్తులు, ఆకతాయిలు (అన్యపుష్టచయము), మద్యపానప్రియులు(మత్తమధువ్రతవ్రజంబు), వేశ్యాలోలులు (పల్లవోత్కరము), దుష్టబుద్ధి కల పాపాత్ములు (పాంసులపంకజావళుల్ ), నిన్ను ఒంటరిగా, స్వేచ్ఛగా తిరుగనిస్తారా? " అంటే ఒంటరిగా, స్వేచ్ఛగా తిరిగితే బ్రతుకనిస్తారా అని అర్థము.
ఒక విషయము. శ్రీ అరవిందులవారి " ద టైగర్ అండ్ ద డీర్ " అనే పద్యం గుర్తుకొస్తుంది ఈ సందర్భంలో.
అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఒక జింకపిల్ల, సెలయేటిలో నీరు త్రాగుతుంటుంది. ఒక పెద్దపులి, మెల్లగా అడులో అడుగు వేసుకుంటూ వచ్చి, ఆ జింకపిల్లను చంపుతుంది. అడవిలో జరిగే యీ మూగజీవుల మారణహోమం, మానవసమాజంలో జరిగే అకృత్యాలకు అద్దం పడుతుంది. అయితే అరవిందులవారు, ఎప్పటికైనా జింకపిల్ల అడవిలో స్వేచ్ఛగా తిరిగే రోజొస్తుందంటారు. అది జరగాలంటే, జింకలన్నీ పులిపై తిరగబడాలి, లేదా, పులి క్రూరత్వం తగ్గి, జింకకు కూడా ఆ అడవిలో స్వేచ్ఛగా తిరిగే హక్కు ఊందనే, మానసిక పరివర్తన కలగాలి. జింకపిల్ల అణగారిన, పేద, బలహీన వర్గాలకు ప్రతీక కాగా, పెద్దపులి నియంతృత్వ, నిరంకుశ, ధనిక, బలవంతుల వర్గానికి ప్రతినిధి. ఆశావాదియైన శ్రీ అరవిందులు యీ రెండవ మార్గమైన మానసిక పరివర్తనను అభిలషించారు. అది జరగాలంటే, సమాజంలో భాగమైన ప్రతి వ్యక్తికీ, తన సంస్కృతీ ధర్మాలపైన అచంచలమైన విశ్వాసం కలిగియుండి, ఆ ధర్మాన్ని ఆచరించాలి. పరిపూర్ణయోగాన్ని లోకంలో వ్యాప్తి జేసిన శ్రీ అరవిందయోగి ఆశయము ఫలించు గాక!
No comments:
Post a Comment