కేవల కల్పనాకథలు కృత్రిమరత్నము లాద్యసత్కథ
ల్వావిరిపుట్టురత్నము లవారిత సత్కవి కల్పనా విభూ
షావహ పూర్వవృత్తములు సానల దీరిన జాతిరత్నముల్
గావున నిట్టి మిశ్రకథగా నొనరింపుము నేర్పుపెంపునన్.
కేవలము కవి చేత కల్పింపబడిన కథలు కృత్రిమ రత్నముల వంటివి. పురాణములయందు చెప్పబడిన కథలు పుట్టినవి పుట్టినట్లుగానే ఉన్న రత్నముల వంటివి. అనగా, గనుల నుండి తీయబడిన, శుద్ధిచేయబడని, ముడిఖనిజము వంటిది. కానీ, ఒక సత్కవి గ్రాఢ ప్రతిభచేత మెరుగులు దిద్దబడిన పూర్వకథలు సానబట్టిన రత్నముల వంటివి. కావున, అటువంటి మిశ్రకథను కావ్యరూపములో చెప్పమని తిరుమలరాయలు కోరినట్లు వసుచరిత్రావతారికలో రామరాజభూషణుడు వివరించాడు.
తెలుగు సాహిత్యములో కొన్ని పద్యాలు కవిత్వానికి సంబంధించి ఒక సిద్ధాంత ప్రతిపాదన చేసినట్లుగా కనబడతాయి. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో, పైన ఉదహరించబడిన రామరాజభూషణుని పద్యము అటువంటిదే. ఆధునికులలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు, తమ " శ్రీమద్రామాయణ కల్పవృక్షము " అనే బృహత్కావ్యములో
" మఱల నిదేల రామాయణం బన్నచో " అనే పద్యములో " కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశములయందు తొంబదియైన పాళ్ళు, ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయిరెట్లు గొప్పది నవకథాదృతిని మించి. " అని ఒక సిద్ధాంత ప్రతిపాదన చేశారు.
భట్టుమూర్తి అని పిలువబడే రామరాజభూషణుడు " నరసభూపాలీయము" అనే లక్షణ గ్రంథాన్ని కూడా వ్రాశాడు.
No comments:
Post a Comment