మునిజన భాగదేయమగు మోక్షము పక్షము లేక పల్కి నీ
వనఘవిచార! సారె గొనియాడెదు బూడిదబొట్టువోని యీ
చెనటి గృహస్థ ధర్మమది, చిమ్మెట సింగమె? గాజు రత్నమే?
కనక శలాటుకాధమము కల్పఫలంబె? చలంబు లేటికిన్?
సంపద చేత గాని కొనసాగవు సువ్వె గృహస్థ ధర్మముల్,
సంపద పూర్వజన్మ వికసత్సుకృతంబున గాని చేర, దా
సంపద చేరియున్ మదవశంవదు జేయు మహాత్మునేనియున్,
జంపకు నన్ను గన్నుసిమి, చంపుడు ముంపుడు బోధగాథలన్.
పై రెండు పద్యాలు తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము నందలి అయుత నియుతుల కథ లోనిది.
అయుతుడు, నియుతుడు అనే వారు ప్రయుతుడు అనే వాని కుమారులు. అగస్త్యునికి శుశ్రూష చేసి అతని మెప్పు పొందుతారు. అగస్త్యుడు వారిద్దరికీ తగిన కన్యలు ఎవరని బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ అంతకు ముందు తాను సృష్టించిన గాయత్రి, సావిత్రి అనే కుమార్తెలను అగస్త్యునకు ఇస్తాడు. తిరిగి వచ్చి యీ విషయం అయుత నియుతులకు చెబితే, అయుతుడు వివాహానికి అంగీకరించడు. అగస్త్యుడు ఆ ఇద్దరనూ నియుతున కిచ్చి వివాహం చేస్తాడు. గుర్వాజ్ఞ పాటించనందుకు, బ్రహ్మచర్యం తరువాత ధర్మమార్గంలో గృహస్థాశ్రమం స్వీకరించనందుకు, అగస్త్యుడు అయుతుణ్ణి వెళ్ళిపొమ్మంటాడు. అయుతుడు హిమాలయప్రాంత భూమికి వెళ్ళి తపస్సు చేస్తుంటాడు. ఉగ్రమైన ఆ తపస్సుకు భయపడి ఇంద్రుడు వృద్ధబ్రాహ్మణ వేషంలో అయుతుని వద్దకు వచ్చి గృహస్థాశ్రమం యొక్క ప్రాశస్త్యాన్ని పలు విధాలుగా వివరిస్తాడు. అయినా ఇష్టపడని అయుతుడు, గృహస్థాశ్రమం లోని ఇబ్బందులను ఏకరువు పెడతాడు. అదే పై పద్యాల లోని విషయము.
"మునులకు సంపద అయినటువంటి మోక్షము పక్షాన మాట్లాడకుండా, బూడిద బొట్టులాంటి గృహస్థాశ్రమం గురించి గొప్పగా చెబుతావేంటి? ఎంతచెప్పినా, చిమ్మెట సింహమవుతుందా, గాజుముక్క రత్నమవుతుందా, ఉమ్మెత్త కాయ కల్పవృక్ష ఫలమౌతుందా?
సంపద ఉంటే గానీ గృహస్థు మనుగడ సాగించలేడు. ఇక సంపదలంటావా, పూర్వజన్మ సుకృతం వల్ల గానీ రావు. ఒకవేళ వచ్చినా, అవి మహాత్మునికి కూడా మదాన్ని కలిగిస్తాయి. " అందుకని నిండా ముంచే యీ కథలు, బోధలు చెప్పి, తనను చంప వద్దన్నాడు అయుతుడు.
ఇంద్రుడు గృహస్థాశ్రమం గురించి చెప్పిన విశేషాలు (సువర్ణ సుమన సుజ్ఞేయము -18 లో చూడండి), ఇప్పుడు అయుతుడు వాటికి దీటుగా చెప్పిన సమాధానము, ఒక న్యాయస్థానములో ఇద్దరు తమ తమ వాదనలను సాక్ష్యాలతో సహా, సహేతుకంగా వాదించిన తీరు కనిపిస్తుంది. ఇందులోని ధర్మాధర్మాలను ప్రక్కన పెడితే, ఇద్దరు మంచి న్యాయవాదుల మధ్య జరిగిన బ్రహ్మాండమైన వాదనను తలపిస్తాయి ఇంద్రునికి అయుతునకు మధ్య జరిగిన సంభాషణలు.
No comments:
Post a Comment