ప్రామినుకులదొంగ బాతాళకుహరంబు
జొరబాఱి చీఱినచోఱ వీవ
తరిగొండ వెన్నుపై దాల్చి వేల్పుల గూటి
చవి దేల్చినట్టి కచ్ఛపమ వీవ
నీటిలో మునిగిన నేల చేడియ గొమ్ము
కొన నుబ్బ నెత్తిన ఘోణి వీవ
మునిమాపు బలుగంబమున బుట్టి బట్టు న
క్కఱను గాచినట్టి సింగంబ వీవ
దితిజు మెట్టిన యా పొట్టిదిట్ట వీవ
పుడమిఱేడుల నడచిన ప్రోడ వీవ
కడలి గోలకు దెచ్చిన గబ్బి వీవ
యిపుడు ద్వారక వసియించునీవు నీవ.
దశావతార వర్ణనలలో శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ చెప్పిన పద్యాలు తెలుగు సాహిత్యంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఒక్కొక్క మహాకవి చెప్పిన తీరు ఒక్కొక్క విధంగా, ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. అటువంటిదే, నంది తిమ్మన గారి పారిజాతాపహరణములో, నారదుడు చేసిన యీ శ్రీకృష్ణ స్తవం.
ఈ పద్యంలో, మీనావతారం మొదలు, కృష్ణావతారం వరకు వర్ణింపబడిన శ్రీమహావిష్ణువు అవతారములు, అచ్చ తెలుగులో చెప్పబడ్డాయి. అదీ, యీ పద్యం అందం.
ప్రామినుకులంటే వేదములు. వాటిని దొంగిలించి పాతాళంలో దాచడం ఇవన్నీ మత్స్యావతార విశేషాలు. తరిగొండ మంథర పర్వతము. దానిని వీపుపై దాల్చి దేవతల కూటి చవి ( ఆహారరుచి - అమృతపానము) తీర్చినది ఆదికూర్మము. నీటిలో మునిగిన నేలచేడియను (భూదేవిని) ఉద్ధరించినది వరాహరూపుడైన విష్ణువు. మాపు అంటే రాత్రి. మునిమాపు అంటే రాత్రికి ముందు, సాయంకాలము. ఆసమయంలో స్తంభము నుండి వెలువడి హిరణ్యకశిపుణ్ణి చంపింది నృసింహమూర్తి. బలి చక్రవర్తిని పాతాళానికి మెట్టిన (అణగదొక్కిన) పొట్టిదిట్ట వామనుడు. పుడమిఱేడుల నడచిన ప్రోడ పరశురాముడు. కడలి గోలకు దెచ్చిన గబ్బి (బాణాన్ని సంధించిన వీరుడు) రాముడు. ఇక తేటగీతిలోని " యిపుడు ద్వారక వసియించు నీవు నీవ " అందము గురించి ఏమని చెప్పాలి? విశ్వనాథవారు చెళ్ళపిళ్ళ వారి గురించి " తన శిష్యులన్న యెడదం గల ప్రేముడి చెప్పలేని మెత్తన " వంటిదే యిది. ఈ " నీవు నీవ " అనేది, శ్రీకృష్ణుని యొక్క దశావతారాలకు భిన్నమైన, పరిపూర్ణ తత్వాన్ని, సర్వాంతర్యామిత్వ, సర్వవ్యాపకత్వాన్ని స్పృశిస్తుంది.
ఇటువంటి పద్యాలను తదేకాయత్త చిత్తంతో రోజూ మననం చేస్తే, అవి మంత్రాలై కూర్చోవా?
No comments:
Post a Comment