నీ సంప్రశ్నము వర్ణనీయము గదా నిక్కంబు రాజేంద్ర! ల
క్ష్మీసంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింప ద
ద్దాసాఖ్యానము లొప్పు విష్ణుచరణధ్యాన ప్రధానంబులై
శ్రీసంధానములై మునీశ్వర వచో జేగీయమానంబులై.
శ్రీమదాంధ్రమహాభాగవతము, సప్తమ స్కంధము లోని యీ పద్యము కూడా చాలా ప్రసిద్ధి వహించినది.
ఈ సప్తమ స్కంధము విశేషమేమంటే, ఇందులోని విష్ణుకథలను పరమవిష్ణుభక్తుడైన నారదుడు ధర్మరాజునకు చెప్పినట్లుగా, శుకుడు పరీక్షిత్తునకు చెబుతాడు. లక్ష్మీసంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు. పరమ భాగవతోత్తముడైన పోతన, భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ , ' భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు ' అన్నారు. భగవంతుని యొక్క, భాగవతుల యొక్క, సచ్చరిత్రలను ఎంతని వర్ణించగలము, ఎంత వర్ణిస్తే తనివి తీరుతుంది? ఈ దాసాఖ్యానము లెటువంటివి? విష్ణుచరణధ్యాన ప్రధానములైనవి, మునీశ్వర వచో జోగీయమానములైనవి. మునీశ్వరుల వల్ల మహనీయంగా, మధురంగా భావించబడ్డవి. దాసులలో దాసుడు, మునులకెల్ల మునియైన నారదుని కంటె అర్హులెవరు విష్ణుకథలను చెప్పడానికి?
ఈ పద్యము లోని ఉపసర్గలు గమనించదగ్గవి. ప్రశ్న అనేది తెలుకొనేవాడి జిజ్ఞాసను పట్టిస్తుంది. ఇక సమాధానము జిజ్ఞాసువు ప్రశ్నను బట్టి ఉంటుంది. ఈ మాట ఎందుకంటున్నానంటే, లోకంలో ఉబుసుపోకకు ప్రశ్నను అడిగేవారే అధికం. అందువల్ల, ప్రశ్న మంచిదయి ఉండాలి. సం అనే యీ ఉపసర్గకు చక్కని, మిక్కిలి అని అర్థము. సంప్రశ్నము అంటే చక్కని, మిక్కిలి గొప్పదైన ప్రశ్న. చక్కని ప్రశ్నకు సమాధానం కూడా అంతే చక్కగా, గొప్పగా ఉండాలి. పిండికొద్దీ రొట్టె అన్నట్లు, ప్రశ్నలడిగిన ధర్మరాజు, పరీక్షిత్తు మహాధర్మాత్ములు. నారద, శ్రీశుకులు అస్ఖలిత బ్రహ్మచారులు, విష్ణుభక్తులు, పరమ వైరాగ్యసంపన్నులు. ఇంక చెప్పేదేముంది?
No comments:
Post a Comment