పాటలగంధి చిత్తమున బాటిలు కోపభరంబు దీర్ప నె
ప్పాటను బాటు గామి మృదుపల్లవ కోమల తత్పదద్వయీ
పాటలకాంతి మౌలిమణిపంక్తికి వన్నియ వెట్ట నా జగ
న్నాటక సూత్రధారి యదునందను డర్మిలి మ్రొక్కె మ్రొక్కినన్.
జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తన
ర్చు లతాంతాయుధుకన్నతండ్రి శిర మచ్చో వామపాదంబునం
దొలగం ద్రోచె లతాంగి యట్ల యగు నాథు ల్నేరము ల్సేయ బే
రలుకం జెందినయట్టి కాంత లుచిత వ్యాపారము ల్నేర్తురే?
ఈ రెండు ప్రసిద్ధమైన పద్యాలు నంది తిమ్మన గారి పారిజాతాపహరణము ప్రథమాశ్వాసము లోనివి.
శ్రీకృష్ణుడు రుక్మిణీ గృహంలో ఉన్నప్పుడు నారదుడు వచ్చి మహిమాన్వితమైన పారిజాత పుష్పాన్ని దేవదేవునకిస్తాడు. దానిని తనకు అత్యంత ప్రియమైన భార్యకు ఇవ్వవలసినదంటాడు. ఆ పుష్పాన్ని కృష్ణుడు రుక్మిణికి ఇస్తాడు. చెలికత్తె ద్వారా యీ విషయము తెలిసికొన్న సత్యభామ కోపగృహాన్ని చేరి అలుక బూనుతుంది. సత్యభామ దగ్గరకు వచ్చిన ఆ జగన్నాటకసూత్రధారి, ఏ విధంగానూ ఆమె కోపాన్ని ఉపశమింప చేయలేక, చిగురుటాకు కంటె మెత్తనైన ఆమె ఎఱ్ఱని పాదములు, తాను ధరించిన కిరీటమునందలి మణుల కాంతిని ఇనుమడింపజేయునన్నట్లుగా, శిరస్సును వంచి నమస్కరించాడు.
అప్పుడు అసలే కోపంతో ఉన్న సత్యభామ ఏం చేసింది? ఆమె పాదములపై నున్న భర్త శిరస్సును తన ఎడమ కాలితో ప్రక్కకు తీసింది (తొలగం ద్రోచె). అబ్బ! మంచి పని చేసిందిలే అంటున్నాడు కవి. ఎందుకని? మరి ఆ శిరస్సు మామూలు శిరస్సా? జలజాతాసనుడు (బ్రహ్మ), వాసవుడు (ఇంద్రుడు) మొదలుగా గల దేవతల చేత పూజ లందుకొనే, లతాంతాయుధు (మన్మథుని) కన్నతండ్రి, విష్ణువు (కృష్ణుని) యొక్క శిరము.
చివరగా ఎట్లా సమన్వయము చేశాడు కవి? " నాథు ల్నేరము ల్సేయ పేరలుకం జెందిన కాంత లుచిత వ్యాపారము ల్నేర్తురే? ".
అవును. తన భర్త చేసిన ఇంత నేరమునకు, సత్యభామ మంచి పనే చేసింది. సర్వ దేవతల పూజ లందుకొనే ఆ శిరస్సు, పారిజాత పుష్పము ఇవ్వలేదని, సపత్నుల ముందు తనను చిన్నబుచ్చాడని, ఏదో అలిగిందే అనుకో, ఆమె పాదాలకు జగన్నాటకసూత్రధారి మ్రొక్కుతాడా? మానవతియైన సత్యభామ దానిని సహించగలదా? అందుకని, భర్త చేసిన పని ఆమెకు నచ్చక తొలగ ద్రోసింది.
కవిసామ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ గారు ఇంత చక్కని వ్యాఖ్యానాన్ని అందించారు తమ " సాహిత్య సురభి " లో.
No comments:
Post a Comment