శ్రీకాంతామణి గన్మొరంగి మది ధాత్రిన్ మంచినన్, తద్రుచి
శ్రీకాదంబిని మీదికుబ్బెననగా శ్రీవత్సమున్ దాల్చి ము
ల్లోకంబుల్ పొదలించు కృష్ణుడు దయాళుండేలు శ్రీవైష్ణవ
స్వీకారార్హు విరూరి పట్టణపతిన్ వేదాద్రి మంత్రీశ్వరున్!
ప్రాచీనాంధ్ర పంచ మహాకాకావ్యాలలో ఒకటిగా పేరెన్నిక గన్న తెనాలి రామకృష్ణునిచే రచింపబడిన పాండురంగ మాహాత్మ్యము కావ్యము అవతారికలోని మొదటి పద్యమిది. కావ్యారంభమే చాలా గొప్ప ఊహతో జరిగింది.
శ్రీకాంతామణి లక్ష్మీ దేవి. ఆవిడ కన్నుగప్పి మనస్సులో భూదేవిని తలంచాడట శ్రీమహావిష్ణువు. అప్పుడు ఆ భూమి యొక్క గొప్పదైన కాంతి ఆయన వక్షస్థలం మీదకు ఉబ్బిందట. అది ఎట్లా కనిపించింది? శ్రీకాదంబిని (గొప్ప మేఘం) లాగా ఉబ్బి స్వామివారి వక్షస్థలం మీద శ్రీవత్సం లాగా కనిపించింది. శ్రీమహావిష్ణువు వక్షము మీద నున్న పుట్టుమచ్చకు శ్రీవత్సమని పేరు. అటువంటి శ్రీవత్సమును దాల్చిన కృష్ణుడు కృతిస్వీకర్తయైన విరూరి వేదాద్రి మంత్రిని రక్షించు గాక. ఇదీ పద్యం యొక్క అర్థం.
శ్రీమహాలక్ష్మి శ్రీమహావిష్ణువునకు నిత్యానుపాయిని. ఎప్పుడూ ఆయనకు దగ్గరగానే ఉంటుంది. ఇంకొక దేవేరి భూదేవి దూరంగా ఉన్నా ఆయన అంతరంగంలో ఉంటుంది. ఆమె ప్రేమ పైకి వచ్చి శ్రీకాదంబిని (గొప్ప మేఘం) లాగా ఉబ్బి శ్రీమహావిష్ణువు వక్షము మీద శ్రీవత్సమనే పుట్టుమచ్చ లాగా కనిపించింది.
ఇది చాలా చక్కని ఊహ. ఆకాశమార్గంలో వెళ్తూ పైనుండి క్రిందకు చూచిన వారికి, భూమి నల్లనైన మేఘాల మధ్య కనిపిస్తుంది. అందుకే భూమిని శ్రీమహావిష్ణువు వక్షము మీదకు ఉబ్బిన శ్రీవత్సమనే నల్లని పుట్టుమచ్చగా అభివర్ణించాడు కవి. మేఘము నల్లనిది, పుట్టుమచ్చ నల్లనిది. ఆకాశం అంతటా వ్యాపించియున్న మేఘపటలాన్ని, సర్వవ్యాపియైన శ్రీమహావిష్ణువు పుట్టుమచ్చతో పోల్చడం అత్యద్బుతం.
అయితే గడుసువాడైన తెనాలి కవి ఈ పద్యంలో భావి కథార్థాన్ని సూచించాడని డా.డి.ఎస్. గణపతి రావు గారు తమ పాండురంగ మాహాత్మ్యము పామర వ్యాఖ్యానములో వ్రాశారు. విష్ణుభక్తుడైన పుండరీకుడు తనకు ప్రత్యక్ష దైవాలైన తలిదండ్రులను బాహ్యంగా సేవిస్తూ, కృష్ణుణ్ణి తన అంతరంగంలో నిలుపుకున్నాడు. తలిదండ్రులు పరలోకగతులైన తరువాత, అతని అంతరంగ భక్తి ఉబ్బి పైకి వచ్చి తన యెదుట కృష్ణుని రూపంలో నిలిచింది. పుండరీకుడు తన పేరిట పుండరీక క్షేత్రంలో పాండురంగనిగా వెలసి భక్తులను ఉద్ధరించవలసినదని వరం కోరాడు.
ఈ విధంగా రామకృష్ణుడు అవతారికలోని మొదాటి పద్యంతో " మహాంధ్ర కవితా విద్యా బల ప్రౌఢి నీ కెదురేరీ! " అని సూచనప్రాయంగా తెలియజేశాడు.
No comments:
Post a Comment