జనవరి 30వ తేదీ. జాతిపిత మహాత్మాగాంధీ గారి వర్ధంతి. ఒక్క భారతజాతి మాత్రమే గాక యావత్ప్రపంచము స్మరించుకొనే యుగపురుషుడు బాపూజీ. యాదృచ్చికంగా టీ.వీ. చూస్తుంటే, టీ.వీ.5 మూర్తిగారు దక్షిణాఫ్రికా నుంచి, ఆ నాడు (1893 లో) జాత్యహంకార తెల్లవారిచే క్రిందకు త్రోసివేయబడి, సత్యాగ్రహము అనే ఆయుధాన్ని ప్రపంచానికి అందించే స్ఫూరికి, స్మృతికి చిహ్నంగా ఏ ప్రదేశము నిలిచిందో, ఆ పీటర్ మార్టిజ్ బర్గ్ రైల్వే స్టేషన్ను, ఇంకా అనేకమైన దృశ్యాలను ప్రసారం చేసినవి చూసాను. ఈనాడు ఆ ప్రదేశము ప్రపంచము నలుమూలలనుంచి వచ్చే శాంతికాముకులకు దర్శనీయమైన పుణ్యస్థలంగా మారింది. కాశీ, ప్రయాగలకు ఏ మాత్రము తీసిపోని, అటువంటి పుణ్యస్థలాన్ని స్వయంగా దర్శించి, మనలందరకూ చూసే భాగ్యం కలిగించిన టీ.వీ.5 యాజమాన్యానికి సర్వదా కృతజ్ఞుడిని.
ఈ సందర్భంగా, మహాత్ముని గొప్పదనాన్ని తెలియచేసే నవయుగ కవిచక్రవర్తి గుఱ్ఱం జాషువా గారి ఒక పద్యము మీతో పంచుకోవాలని మనసు ఉవ్విళ్ళూరింది.
ఎవడీ యర్థదిగంబరేశ్వరుడు మా యిండ్లం బ్రవేశింప నం
చవమానంబుగ చర్చిలాడగ బకిం హాం సౌధమున్ ద్రొక్కి హైం
దవజాతీయత లీను మేల్పిలక నాట్యంబాడ, శ్రీ జార్జిభూ
ధవు నింటన్ ఫలహారముల్ సలుపు తాతన్ గాంధి నర్చించెదన్.
ఇటువంటి చక్కని పద్యాలు మన పిల్లలకు నేర్పితే, కవి ఋణము, జాతిఋణము తీర్చుకొన్నవారమవుతాము.
1931వ సం. సెప్టెంబరులో, రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ గారు లండను వెళ్ళినప్పుడు, ప్రొద్దున్నే 4.00 గంటలకల్లా లేచి, శరీరం గడ్డకట్టే చలిలో, నదీజలంలో స్నానం చేస్తూ ఉంటే, ఆ ప్రాంతములో ఉన్నవారంతా నోరువెళ్ళబెట్టుకొని చూసారట. అంతటి ఆత్మవిశ్వాసము, అకుంఠిత దీక్ష మహాత్మునికి. ఈ విషయాన్ని ఆనాటి దినపత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయట.
" మనలాగే రక్తమాంసాలతో పుట్టిన ఒక వ్యక్తి అహింస, సత్యాగ్రహము, అనే ఆయుధాలతో రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడని, భావితరాలకు చెబితే వారు నమ్మలేనంత నిజము, యీ అహింసామూర్తి మహాత్మా గాంధీగారి జీవితము. ", అని ఐన్ స్టీన్ మహాశయుని వంటి శాస్త్రవేత్త, మానవతావాది అన్నాడంటే......." కేవల మర్త్యుడే గాంధిగారు?."
అందుకే, " ఆతడు ఒక మనిషి కాదు, ఒక యుగపురుషుడు. " అని జార్జి బెర్నార్డ్ షా కీర్తించారు.
No comments:
Post a Comment