మలయపు గాలి రేలు వనమాలి విమాన పతాక ఘ
ల్లుమం చులియ బసిండి మువ్వగమి నొక్కొకమాటు గదల్ప, నుల్కి మి
న్నలము తదీయ హేమ వరణాంచల చంపక శాఖలందు బ
క్షులు రొదసేయ, వేగెనని కూడుదురల్కలు దీఱి దంపతుల్.
శ్రీవిల్లిపుత్తూరులో రంగనాథస్వామి ఆలయముంది. ఆలయప్రాంగణంలోనికి ప్రవేశించగానే, ఎదురుగా ధ్వజస్తంభము, పైన పతాకము, దానికి వ్రేలాడే బంగారు మువ్వలు. ఆ గుడి చుట్టూ ఎత్తైన ప్రాకారము. ప్రాకారాపు అంచుల్లో సంపెంగ చెట్లు. సంపంగి చెట్ల కొమ్మల్లో గూళ్ళుకట్టుకొన్న పక్షులు. అది ప్రాతఃకాల సమయము. మలయమారుతము వీస్తున్నది. ఆ గాలికి ఉండి ఉండి బంగారు మువ్వలు ఘల్లు ఘల్లుమని మ్రోగుతున్నాయి. ఆ చప్పుడుకి కొమ్మల్లో గూళ్ళు కట్టుకొని నిద్రిస్తున్న పక్షులు ఉలిక్కిపడి రొదచేయడము మొదలుబెట్టాయి. ఆ సవ్వడి వినేటప్పటికి, గుడికి చుట్టుప్రక్కల ఇళ్ళలో కాపురముంటున్న దంపతులు, ప్రణయకోపాన్ని ప్రక్కనబెట్టి, కలుసుకున్నారు.
శ్రీకృష్ణదేవరాయలవారి ఆముక్తమాల్యద మహాప్రబంథము ప్రథమాశ్వాసము లోని, మనసును గిలిగింతలు పెట్టే ప్రాతఃకాల వర్ణనమిది.
No comments:
Post a Comment