శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహ న్యవిహతాం స్త్రీపుంసయోగోధ్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వ స్సురై
ర్భూయాస్సుః పురుషోత్తమాంబుజభవశ్రీకంధరా శ్శ్రేయసే.
శ్రీమదాంధ్ర మహాభారతము తెలుగులో రచించడానికి నాంది పలికింది ఆదికవి నన్నయ. ఆదిపర్వము, ప్రధమాశ్వాసములోని ఈ శ్లోకము మంగళశ్లోకము. కావ్యారంభంలో ఆశీర్వచనం కానీ, నమస్కారం కానీ, వస్తునిర్దేశం గానీ ఉండాలనేది లాక్షణికుల నిర్దేశం. దాన్ని అనుసరించి నన్నయ , ఆశీర్వచనాన్ని దేవభాషయైన సంస్కృతంలో చేసి, కావ్య రచనకు ఉపక్రమించారు.
ఏ విష్ణు బ్రహ్మ మహేశ్వరులు క్రమంగా లక్ష్మీ సరస్వతీ పార్వతులను వక్షస్థలంలోను, ముఖంలోను, శరీరంలోను ధరించి, స్త్రీపురుష సంయోగ ఫలితమైన యీ జగత్తును సుస్థిరంగా, అవిచ్ఛిన్నంగా పాలిస్తున్నారో, వేదమూర్తులైన, పూజనీయులైన అట్టి త్రిమూర్తులు మీకు శుభమును కలిగించు గాక అని యీ శ్లోకము భావము.
నన్నయ ఋషి. " ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి " అన్నారు విశ్వనాథ. అందువలననే, లోకంలో అలవాటుగా ఉన్న సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మవిష్ణుమహేశ్వరులనే క్రమంలో కాకుండా, నారాయణ శబ్దభవుడైన నన్నయ, కవిబ్రహ్మ వాచ్యుడైన తిక్కన, ప్రబంధపరమేశ్వరుడైన ఎఱ్ఱనలచే మహాభారత రచన పరిసమాప్తి అవుతుందనే అర్థం స్ఫురించేటట్లు, త్రిమూర్తులైన విష్ణు బ్రహ్మ మహేశ్వరులనే క్రమమే ఆయన నోటివెంట ఋషివాక్కుగా వెలువడింది. అంతేగాక, త్రిమూర్తులు సనాతన దాంపత్య జీవనానికి ప్రతీకలు. అందువల్లనే, స్త్రీపుంసయోగోద్భవమైన లోకాన్ని అవిచ్ఛిన్నంగా సాగించారని విష్ణు బ్రహ్మ మహేశ్వరులను, వారి దేవేరులను పేర్కొనడము జరిగింది.
ఇన్ని విశేషాలు ఉండడం వల్ల యీ శ్లోకము, ఇన్ని శతాబ్దాలు గడచినా రసజ్ఞుల హృదయాల్లో చెక్కు చెదరకుండా ఉంది.
No comments:
Post a Comment