ఉల్లమునందు నక్కటికమూనుట నీకులమందు గంటిమం
చల్లన మేలమాడు నచలాత్మజ మాటకు లేతనవ్వు సం
ధిల్ల గిరీటి బాశుపత దివ్యశరాఢ్యుని జేయు శాంబరీ
భిల్లుడు గృష్ణరాయల కభీష్టశుభప్రతిపాది గావుతన్.
మహాకవుల కావ్యావతారికలలో కొన్ని పద్యాలు ఎన్ని సార్లు చదివినా తనివి తీరనట్లే ఉంటాయి. అవి ఇష్టదేవతా ప్రార్థన పద్యాలయితే, ఇక చెప్పే పనేముంది? ఆ పద్యాల కోవకు చెందిన పెద్దన గారి మనుచరిత్రము పీఠిక లోని యీ పద్యాన్ని పరిశీలిద్దాం.
అరణ్యవాసకాలంలో అర్జునుడు శివుని కోసం తపస్సు చేశాడు. అతని తపోదీక్షను పరీక్షించడానికై శివుడు కిరాతరాజు వేషంలో వచ్చి, క్రీడార్థంగా అర్జునుడితో పోరాడి, ఓడినట్లు నటించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని " మీ కులంలో ఎప్పుడూ లేని జాలి కనిపించిందే! " అని ఛలోక్తులు విసరింది పార్వతి. ఆ పరిహాసోక్తులకు చిరునవ్వు నవ్వి అర్జునునకు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించిన శివుడు కృష్ణరాయలకు అభీష్టసిద్ధి కలిగించుగాక అని ఆశీర్వచనము పలికాడు పెద్దన పై పద్యంలో.
పరిహాసమాడిన పార్వతి పరంగా ' అచలాత్మజ ' అని వాడటము, హాసముతో దయాశాలియైన శివుడు పాశుపతాస్త్రాన్ని అర్జునునకు ఇచ్చాడనడము, ఎంతో భావయుక్తంగా, సముచితముగా ఉంది. పరిహాసమాడిన పార్వతి అచలాత్మజ కావున, భక్తుల భావపథ విహారియైన శివుని హాసాన్ని, మనోగతాన్ని అర్థం చేసుకోగలిగింది.
జాలి , ప్రేమ కలిగియుండడమనేది ఉత్తముల లక్షణం. శివుడు, ఈ జగత్తు మీద అమితమైన ప్రేమ గల అర్జునునకు పాశుపతాన్ని ఇచ్చాడు గానీ అయోగ్యులకు గాదు. సర్వ జగత్తును క్షణకాలంలో భస్మీపటలం చేయగల ఆ పాశుపతాస్త్రాన్ని అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో వాడలేదు. అదీ, నరునకు నరజాతిపై గల ప్రేమ. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పడం కోసమే కవిసమ్రాట్టులు " గుప్తపాశుపతము (దాచియుంచిన లేక ఉపయోగించని పాశుపతము) " అనే నాటకాన్ని జాతికందించారు.
No comments:
Post a Comment