అనఘతపోభిరాము డగు నత్రి మునీంద్రుడు గాంచె దప్త కాం
చన ఘన చంద్రికా రుచిర చారుశరీరుల హంస నాగసూ
దన వృషభేంద్రవాహుల నుదార కమండలు చక్ర శూల సా
ధనుల విరించి విష్ణు పురదాహుల వాక్కమలాంబికేశులన్.
ఈ పద్యం పోతన మహాకవి ఆంధ్రీకరించిన శ్రీమదాంధ్ర మహాభాగవతము చతుర్థ స్కంధము లోనిది. అత్రి మహాముని ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు అతని ఎదుట బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ఇదీ పద్యం యొక్క భావం. అయితే దీనిని ఒకే వరుసలో చెప్పడం జరిగింది. ఇదే ఈ పద్య విశేషము. చూడండి.
త్రిమూర్తులు విరించి (బ్రహ్మ), విష్ణువు, పురదాహుడు (శివుడు).
వారి శరీర ఛాయ తప్త కాంచనము ( మేలిమి బంగారము- పసుపు పచ్చ ),
ఘన (మేఘం - నలుపు), చంద్రిక (వెన్నెల - తెలుపు).
వారి వాహనములు హంస, నాగసూదన (గరుత్మంతుడు), వృషభము.
వారి సాధనములు. కమండలము, చక్రము, శూలము.
వారి భార్యలు. వాక్కు (సరస్వతి), కమల (లక్ష్మి), అంబిక (పార్వతి)
ఒకే వరుసలో ఈ రకంగా చెబితే దీన్ని యథాసంఖ్యాలంకారము లేక క్రమాలంకారము అంటారు. బాగుంది కదా!
చివరగా, ఇంకొక తమాషా - హంస రెక్కలు బంగారం రంగులోను, గరుత్మంతుడు మేఘవర్ణంలోను, వృషభం (నందీశ్వరుడు) తెల్లగాను ఉండటము.
No comments:
Post a Comment