తల బక్షచ్ఛట గ్రుచ్చి బాతువులు కేదారంపు గుల్యాంతర
స్థలి నిద్రింపగ జూచి యారెకు లుష స్స్నాత ప్రయాత ద్విజా
వలి పిండీకృత శాటులన్ సవి దదావాసంబు జేర్పంగ రే
వుల డిగ్గ న్వెసబాఱువాని గని నవ్వున్ శ్శాలిగోప్యోఘముల్.
పల్లెటూళ్ళ అందం వర్ణించడానికి సాధ్యం కాదు. పచ్చటి పైరుపొలాలు, పొలాల్లో వరిపైరు, పొలాలకు నీరు పారించడానికి కాలువలు, ఆ కాలువల అంచుల్లో తెల్లవారు ఝామున రెక్కల సందుల్లో తలలు పెట్టి పడుకున్న బాతులు. ఇంత చక్కని దృశ్యానికి రూపకల్పన చేయాలంటే ఇద్దరికే సాధ్యం. ఒకడు చిత్రకారుడు, రెండవవాడు కవి. అదే ఒక చక్రవర్తికవి, కవిచక్రవర్తి అయితే, అద్భుత కళాఖండంగా రూపుదిద్దుకొంటుంది. అదే జరిగింది యీ పద్యములో. చూడండి.
శ్రీవిల్లిపుత్తూరు చుట్టూ మాగాణి పొలాలున్నాయి. పొలాలన్నీ పచ్చటి వరిపైరుతో కళకళ్ళాడుతున్నాయి. పొలాలకు నీటికాలువలు తీర్చబడ్డాయి. అది తెల్లవారు ఝాము వేళ. నగర రక్షకులు కాలకృత్యాలను తీర్చుకొనడానికి ఆ వైపుకి వచ్చారు. ఆ కాలువల అంచుల్లో బాతులు రెక్కలు ముడుచుకొని, తలలు రెక్కల్లో పెట్టుకొని పడుకున్నాయి. నగర రక్షకులకు అవి ఏవో ఎఱ్ఱంచు గలిగిన తెల్లని ధోవతుల్లాగా కనబడ్డాయి. " అరరే! అయ్యగార్లు స్నానం జేసి పిండిన ధోవతులు ఇక్కడే మరచిపోయి వెళ్ళిపోయారే! వాళ్ళకిద్దాము. " అనుకొంటూ రేవుల్లో దిగి దగ్గరకు వెళ్ళేటప్పటికి, ఆ బాతులు రెక్కలు టపటపా కొట్టుకొంటూ పరిగెత్తుకొనిపోయాయి. ఇది జూచి వరిమళ్ళకు కాపలాగా ఉన్న స్త్రీలు పకపకా నవ్వారు.
పల్లెటూళ్ళలో కనిపించే ప్రకృతి దృశ్యాలతో బాటు, ఆ ఊరి బ్రాహ్మణులు స్నానార్థమై వచ్చి, అక్కడ పిండి వదలివెళ్ళిన ధోవతులు, బాతులుగా కనిపించడము అత్యంత రమణీయంగాను, సహజ సుందరంగాను ఉన్నాయి. అంతేగాక, రాయలవారు ఆ నాటి సంఘవ్యవస్థను ఈ పద్యంలో ఇమడ్చడం ఇంకొక విశేషం. పొలాలకు చక్కని నీటిపారుదల వ్యవస్థ, నగర పరిరక్షకులు, అన్నిటికీ మించి, ధర్మపాలకుడైన ప్రభువు నీడలో, నగర రక్షకుల ధర్మ బుద్ధి, యీ పద్యంలో ద్యోతమానమవుతున్నది.
ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు గట్టినట్లు వర్ణించడము ఒక్క సాహితీసమరాంగణ సార్వభౌమునకే సాధ్యమంటే అతిశయోక్తి కాదేమో! ఆముక్తమాల్యద ప్రథమాశ్వాసములో కనుపించే ఇటువంటి వర్ణనలు యీ మహాకావ్యంలో కోకొల్లలు..
No comments:
Post a Comment