మనమొక కావ్యం చదువుతున్నప్పుడు, కొన్ని పద్యాలు మనస్సును కట్టిపడవేస్తాయి. అది వానిలో నున్న అర్థము గాంభీర్యం వల్ల కావచ్చును లేక అక్షర రమ్యత వల్ల కావచ్చును. అటువంటి పద్యమే తెనాలి రామకృష్ణుని యీ పద్యము.
కందర్పాస్త్రములంచు సంచిత తటిత్కాండంబులంచుం సుధా
మందస్యందములంచు, గాంచన లతామత్తల్లులంచున్ సుధీ
బృందంబుల్ ధ్వనినిందలం దెగడు నీ బింబోష్ఠలందెల్ల నా
నందాభాసమె గాక భాసిత చిదానందంబు పెంపొందునే?
సువర్ణ సుమన సుజ్ఞేయము -25 లో, గృహస్థాశ్రమాన్ని నిరాకరించడానికి అయుతుడు తన బలమైన వాదనలు వినిపించాడో వివరించాను. దానికి కొనసాగింపుగా, ఈ పద్యంలో, స్త్రీల సుకుమారత్వము చాటున దాగియున్న అశాశ్వతత్వాన్ని ఎత్తిచూపుతున్నాడు చూడండి.
ఈ పద్యములో స్త్రీల సౌందర్యాన్ని పొగుడుతూ మంచి విశేషణాలను వాడారు కవి. పైకి కనిపించే యీ పొగడ్త వెనుక తెగడ్త కూడా, అందమైన గులాబి పువ్వు వెనుక గుచ్చుకొనే ముల్లు లాగా, ఉందని గ్రహించాలి. కందర్పాస్త్రములు - మన్మథుని కుసుమ బాణాలు (సుకుమారమైనవే గాని వాడిపోయేవి), సంచిత తటిత్కాండమ్ములు - చక్కని మెరుపుల గుంపులు (కళ్ళు మిరిమిట్లు గొలిపే సొగసు కలిగినవే గానీ క్షణికములు), సుధామందస్యందములు - మెల్లగా పారు అమృత ప్రవాహములు ( తియ్యనైనవే గానీ చంద్రుని కాంతి వలె క్షీణించునవి), కాంచన లతామత్తల్లులు - సంపంగి తీవలు (సువాసనాభరితమైనవే గాని ఎండి పోయేటటువంటివి). కావున, యీ బింబోష్ఠలందు (స్త్రీల యందు), ఆనందాభాసమే (ఆనందమనే భ్రమ) గానీ భాసిత చిదానందము (ప్రకాశవంతమైన, శాశ్వతమైన ఆనందము) ఎలా ఉంటుందని అయుతుడు బ్రాహ్మణవేషంలో నున్న ఇంద్రుణ్ణి ప్రశ్నించాడు.
ఈ పద్యము యొక్క విశిష్టత దీర్ఘసమాసగతమైన అక్షర రమ్యతలోను, స్తుతి వలె నున్న ధ్వనినిందలో ఉంది. చివరకు, ఏ స్త్రీల గురించి యీ పద్యములో ముచ్చటించామో, ఆ స్త్రీలకు ' సుధీబృందములు ' అని అందమైన పదబంధాన్ని వాడారు. అందువల్లనే, పాండురంగ విభుని పదగుంఫనంబు ' అని రసజ్ఞుల, విమర్శకుల ప్రశంస పొందింది తెనాలివాని రచనాశైలి.
No comments:
Post a Comment