అమితాఖ్యానక శాఖలం బొలిచి, వేదార్థమలచ్ఛాయమై,
సుమహద్వర్గచతుష్కపుష్పవితతిన్ శోభిల్లి, కృష్ణార్జునో
త్తమ నానాగుణకీర్తనార్థఫలమై , ద్వైపాయనోద్యానజా
త మహాభారత పారిజాత మమరున్ ధాత్రీసురప్రార్థ్యమై.
నన్నయచే ఆంధ్రీకరింపబడిన శ్రీమదాంధ్రమహాభారతము ఆదిపర్వము, ప్రథమాశ్వాసములో మహాభారత సంహితానిర్మాణ ప్రశంసకు సంబంధించినది యీ పద్యము.
మహాభారతములో అనేక ఉపాఖ్యానాలు, అంటే, ఉపకథలు ఉన్నాయి. ఆ కథలు వేదార్థ ప్రతిపాదికాలు. అందుకనే దీనికి పంచమవేదమనే ప్రతీతి ఉంది. భారతము ధర్మార్థకామమోక్షములనే నాలుగు పురుషార్థాలను అనుష్ఠించడానికి ఉపకరిస్తుంది. మహాభారతేతిహాసములో కృష్ణార్జునుల ఉత్తమగుణ విశేషాలు ఎంతో గొప్పగా చెప్పబడ్డాయి. కృష్ణద్వైపాయన వ్యాసునిచే రచింపబడిన ఇంతటి మహాకావ్యము, బ్రాహ్మణశ్రేష్ఠులచే కీర్తింపబడి, ఒక మహేతిహాసంగా అలరారుతున్నది.
ఈ పద్యంలో మహాభారతము వ్యాసుడనే ఉద్యానవనంలో పుట్టిన కల్పవృక్షంగా వర్ణించబడ్డది. ఇందులో ఉన్న చక్కని కథలు దీని కొమ్మలు. ఈ కథలు చదివితే, వేదార్థమనే చక్కని నీడ లభిస్తుంది. ఈ కొమ్మలకు పూచిన పూవులే ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే నాలుగు పురుషార్థాలు. ఇక ఈ వృక్షానికి కాసిన చక్కటి పండ్లు సర్వగుణశోభితులైన కృష్ణార్జునులు. స్వర్గలోకంలోని పారిజాతవృక్షం సురులచే పూజింపబడగా, మహాభారతము ధాత్రీసురులచే (బ్రాహ్మణులచే) కొనియాడబడుతున్నది.
అవతారికలోని యీ పద్యం కూడా మననం చేయదగిన పలు పద్యాలలో ఒకటి.
No comments:
Post a Comment