నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణా
ఖండల శస్త్రతుల్యము, జగన్నుత! విప్రులయందు, నిక్కమీ
రెండును రాజులందు విపరీతము గావున విప్రుడోపు, నో
పండతిశాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్.
" నిండు మనంబు " వంటి పద్యమునకు " నిండు మనంబు " పద్యమే సాటియని తిక్కన గారు ప్రశంసించిరని యొక కీర్తి పై పద్యమునకున్నదని విమర్శకులు శ్రీ కాజ లక్ష్మీ నరసిం హారావు గారు తమ " ఉదంకుని కథ: నన్నయగారి ఋష్యాత్మ " అనే వ్యాసంలో పేర్కొన్నారు.
నన్నయ ఆంధ్రీకరించిన ఆంధ్రమహాభారతము, ఆదిపర్వములో ఉదంకుని కథ ఉన్నది. ఉదంకుడు ఋషి. పైలుని శిష్యుడు. పౌష్యుడనే రాజు భార్య వద్దనున్న కుండలాలను గ్రహించాడు. రాజు ఉదంకుని " నీవు మాయింట గృతభోజనుండవై పొమ్ము " అన్నాడు. వడ్డించిన అన్నములో వెంట్రుక వచ్చిందని, కోపించి, అపరీక్షితంబయిన అశుద్ధాన్నము పెట్టావు కనుక అంధుడవు కమ్మని శపించాడు ఉదంకుడు. అల్పదోషకారణంతో తనను శపించాడు గనుక, ఉదంకుని అనపత్యుడవు కమ్మని శపించాడు పౌష్యుడు. తాను సంతానహీనుడుగా ఉండలేనని శాపాన్ని ఉపసoహరించమన్నాడు ఉదంకుడు. తనకు ఆ శక్తి లేదని చెప్పిన పౌష్యుడు, బ్రాహ్మణునికి, క్షత్రియునికి గల తారతమ్యాన్ని, మనోవిశ్లేషణాత్మకంగా చెప్పిన అద్బుతమైన పద్యమిది.
" బ్రాహ్మణుడు శాపానుగ్రహ సమర్ధుడు. క్షత్రియుడు అట్లా కాదు. దీనికి కారణం వారి వారి మనస్తత్వాలు. బ్రాహ్మణుని మనస్సు అప్పుడే తీసిన వెన్నలాగా మెత్తనైనది. ఇక మాటంటారా! అతి పదునైన వజ్రాయుధం లాంటిది. ఈ రెండూ, రాజు విషయంలో సరిగ్గా వ్యతిరేకం. మనస్సేమో చాలా కఠినంగా ఉంటుంది, మాట మాత్రం తియ్యగా ఉంటుంది. ఈ తారతమ్యం వల్ల, శాపమనేది మనసు లోతుల్లోనుంచి వస్తుంది కనుక, నవ్య నవనీత సమానమైన మనస్సు కల బ్రాహ్మణుడు, శాపాన్ని వెనక్కి తీసుకొని అనుగ్రహించగలడు. ఆ పని యెంత శాంతుడైన రాజయినా చేయలేడు. కారణం అతని మనస్సే. అది అతి కఠినమైనది. "
ఎంత చక్కని మనోవిశ్లేషణ!
ఈ పద్యంలో విప్ర శబ్దం రెండుసార్లు ప్రయోగించబడ్డది. " విశేషేణ పాపేభ్యః ఆత్మానం పరం చ పాతీతి విప్రః " అని వ్యుత్పత్తి. " తనను, పరుని విశేషముగా పాపము నుండి రక్షించువాడు " అని అర్థము. ఋషి అయిన ఉదంకుని రూపమున యిది నిరూపింపబడినది.
ఇక కథాంతర్గత శాపాల విషయానికి వస్తే, ధర్మాన్ని అనుష్ఠానం చేసే వారి శాపాలు కూడా ధర్మబద్ధంగా, హేతుబద్ధంగా ఉంటాయి.
అపరీక్షితమయిన అన్నము పెట్టాడు గనుక, పౌష్యుడిని అంధుడివి కమ్మన్నాడు. పెట్టిన అన్నము శుద్ధంగా ఉందా లేదా అన్నది చూడవలసినది కన్ను. కన్ను ఆపని సరిగా నిర్వర్తించలేదు కనుక కంటికి శిక్ష. అల్పదోష కారణంబున యింత పెద్ద శాపమిచ్చాడు కనుక, ఉదంకుడిని అనపత్యుడవు కమ్మని శాపమిచ్చాడు పౌష్యుడు. అనపత్యుడు అంటే పిల్లలు లేకుండుట. మరి యీ శాపం వెనుక ఉన్న హేతువు, ధర్మసూక్ష్మం యేమిటి? పిల్లలున్నవారికి కష్టసుఖాలు, తప్పొప్పులు తెలుస్తాయి. ఉదంకుడు సంతానహీనుడయితే గాని, అతనికి చిన్న తప్పుకు యెంత పెద్ద శిక్ష వేశాడో తెలియదు. ఇదీ మన దేశపు ఋష్యాత్మ.