Tuesday 22 September 2020

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

సువర్ణ సుమన సుజ్ఞేయము - 777 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము:కిష్కింధా కాండము: గజపుష్పి ఖండము) 1.గోరంటం బొనరింపనైన పనియున్ గొడ్డంట దీర్పంగనున్ / నేరంగల్గుటయే విచిత్రమగు నీ నీచంబు కార్యంబు నీ / వారంభించుట యిద్ది యిట్లనుచు నీకా చెప్పువారుండిరే / వారిం గూరిచి చెప్పగావలయుఁ దద్వైదగ్ధ్య సంభారముల్. / 2.కోమలమూర్తి నిన్ను గని కోపము వచ్చుట లేదుగాని నీ / యీ మలినంపుఁ గార్యమున కేమియుఁ జేసినఁ జేయవచ్చు ని / న్నా మెయినన్నెదిర్చి రణమాడవుగాని రణంబు లోపలన్ నీ / మృదుదేహమున్ మెదిపి నిర్మథనం బొనరించియుండనే. / 3.ఔరా ! యా యిక్ష్వాకువు / నా రఘువును నా దిలీపుడా దశరథుడు / వారల ప్రతిష్ఠ యేమిటి / వీరుడ వీ చెట్టుచాటు వెలిపని యేమీ? / 4.మా మాంసము తినియెదరో / మీ మానవులయిన పతులు మేము నభక్ష్యం / బౌ మృగపంచకమందు / న్నామయ్యా ! రామ ! పంచనఖములయందున్. / రామబాణంతో నేలగూలిన వాలి రాముడికి ప్రశ్నలను సంధించాడు. " రామా ! అసలు నువ్వు గోటితో పోయే దానికి గొడ్డలి ఉపయోగించటమే చిత్రంగా ఉంది. ఈ నీచమైన పనిని నువ్వు ఆరంభించటం, ఇది ఇట్లా చెయ్యమని నీకు చెప్పారే, వాళ్ళను గురించి, వాళ్ళ నేర్పరితనం గురించి చెప్పుకోవాలయ్యా ! కోమలమూర్తివైన నిన్ను చూస్తే కోపం రావటం లేదు గాని, నువ్వు చేసిన యీ పాపకార్యానికి మాత్రం నిన్నేం చేసినా చేయవచ్చయ్యా ! నువ్వు నాతో ఎదురుగా వచ్చి యుద్ధం చేయలేదు గాని, ఆ రకంగా చేసి ఉంటే, నీ దేహాన్ని మెదిపి ముద్దగా చేసి ఉండేవాడిని. అయ్యో ! ఆ ఇక్ష్వాకువు, రఘుమహారాజు, దిలీపుడు, దశరథుడు వంటి వారి కీర్తిప్రతిష్ఠ లేమిటి, మహావీరుడివి నువ్వు చెట్టుచాటు నుంచి చేసిన నీతిబాహ్యమైన పని యేమిటి? పోనీ, నా మాంసం కోసమని నన్ను చంపావా అంటే, మానవులు తిననటువంటి, ఐదు గోళ్ళు కలిగిన జంతుజాతికి చెందిన వాడిని నేను. " వాలి వధను గూర్చి సందేహాలు చాలామందికి కలుగుతుంటాయి. వాటన్నిటికీ, రాముడు దగ్గర నుంచే సమాధానాలు లభిస్తాయి. తమ్ముడి భార్యను బలవంతంగా గ్రహించినటువంటి అనాగరకపు చర్యకు పాల్పడినా, మర్యాదారాముడు వాలి అడిగిన అన్ని ప్రశ్నలకు సహేతుకమైన జవాబులు ఇస్తాడు. అధర్మవర్తనానికి పాల్పడిన వాలి, ధర్మమూర్తులైన ఇక్ష్వాకువు, రఘువు, దిలీపుడు, దశరథులను ప్రస్తావించటం, చావబోతున్న సమయంలో కూడా ఇంకా అతనిలో చావని అహంకారాన్ని తెలియజేస్తుంది. ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోనివి.

Sunday 20 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 776 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)

తగ నిచ్చోటనె యుండుడంచు బలవంతంబేను గావింప నీ
దగు హృద్వీధి మదాశ్రమంబున నయోధ్యన్ భేదమే లేని
ట్లుగ నద్దాన వనంబున న్నిలిచినట్లుం గాదు నా పైన స్వే

చ్ఛగ మీకుండదు నిత్యమద్గత మనీషా భక్తి శుశ్రూషలన్.

అడుగున గులకరాలై వారి సీలమండల లోతుగా జలజలస్రవించు
నొకచోట, నొకచోట నుజ్వలాగాఢవారి తరంగ భీకర శ్రీ వహించు
వైడూర్యకాంతి ప్రవాహ శోభారమ్య సికతాస్థలంబులు చెన్నుమిగులు
నొకచోట, నొకచోట నొగిఁ దెల్ల చమరిలేళ్ళులతోఁ కలట్టి ఱెల్లుపువులొప్పు

నెచ్చటెచట మీ యిష్టము వచ్చినన్ని 
గిరి నికట భూములును సదాభరితశోభ
లద్ది గోదావరీతీర మచటఁ బంచ
వటి యనంగను నొక్క శుభస్థలంబు.

అది మీ యున్కికిఁ జాల భద్రమగుఁ జో టాచోటి నానా రమా
స్పద శోభావ్రజముం గనుంగొనుచు నీ భావంబు నా రామచం
ద్ర ! దయావార్థి ! యుగాలుగా నచట భద్రంబై రమించున్, భవ
త్పద సీతాపద చిహ్న మా యడవి తాల్పన్ మౌళి పద్మాకృతిన్.

సీతారాములకు అగస్త్యాశ్రమ వాతావరణం అయోధ్యా నగరంలో ఉన్నంత తృప్తి నిచ్చిందిఒక్కచోటనే ఉండటం వనవాసవ్రతాన్ని పాటించినట్లవదన్న భావనతో, శ్రీరాముడు  మిగిలిన నాలుగేండ్లు గడపటానికి అనువైన ప్రదేశం గురించి అగస్త్య మహర్షిని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు.

" మిమ్మల్ని ఇక్కడే ఉండమని నేను బలవంతం చేయను. మీ హృదయాలలో నెలకొన్న యీ ఆశ్రమ వాతావరణానికి  అయోధ్యకు భేదమే లేదన్న భావన సంతోషదాయకమే అయినా, అది వనవాసంలో ఉన్నట్లు కాదుఅంతేకాకుండా, మీరిక్కడ ఉన్నంతకాలం, నా మీద భక్తిశ్రద్ధలు చూపించటం, నా శుశ్రూష చేయటం మీద ధ్యాస పెట్టటం వల్ల, మీకు ఇక్కడ వనవాసంలో ఉన్నంత స్వేచ్ఛ ఉండదు

ఇక అరణ్యప్రాతంలో మీకనువైన ప్రశాంత వాతావరణ మంటారా ! గోదావరి నది ప్రవహించే ప్రదేశముంది చూసారా? ఒక్కొక్క చోట సీలమండల లోతు మాత్రమే ఉండి అడుగున గులకరాళ్ళు కనపడుతూ జలజలా ప్రవహించే నీళ్ళు, ఒకచోట పెద్ద తరంగాలతో గంభీరంగా ఉజ్జ్వల ప్రవాహం, ఇంకొక చోట, అందమైన ఇసుక తిన్నెలతో, వైడూర్యకాంతితో ప్రవహించే నదీజలం, మరొకచోట తెల్లని చమరీమృగాలతో, గెంతే లేళ్ళతో సుందరంగా కనిపించే ఱెల్లుపూల తీరాలు, ఎక్కడపడితే అక్కడ మీకు ఇష్టం వచ్చినన్ని పర్వతసమీప భూములతోఎల్లప్పుడూ అందంగా కనిపిస్తూమనస్సుకు హాయిని కల్గించే గోదావరీతీరంలో పంచవటి అనే శుభప్రదేశం మీరుండటానికి అనువుగా ఉంటుంది.

దయాసముద్రుడా ! రామచంద్రా ! చోటు చాలా భద్రమైనది. మీరుండటానికి అనువైనదిసుందరమైన ప్రదేశం అనేక సంపదలకు ఆలవాలమై, లక్ష్మీప్రదమై, యుగయుగాలనుంచి నీ భావాన్ని భద్రంగా నిలుపుకొన్నది. తలమీద పద్మాన్ని ధరించినట్లుగా అడవి నీ చిహ్నాలను, తల్లి సీత చిహ్నాలను భద్రంగా దాచుకొన్నది. " 

పంచవటిని అనువైన ప్రదేశంగా నిర్ణయించటం ఋషి ప్రణాళికలో ఒక భాగం. సీతాపహరణానికి, తద్వారా, రావణ సంహారానికి నాంది పలికిన మూలప్రదేశమది.

గోదావరీ తీరంలోని పంచవటి ఏది అన్నది అలా ఉంచితే, విశ్వనాథ, తెలుగువారి ఆరాధ్యదైవం భద్రగిరి రాముణ్ణి, సీతమ్మను దృష్టిలో ఉంచుకొని యీ వర్ణన చేసినట్లనిపిస్తుంది

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.

సువర్ణ సుమన సుజ్ఞేయము - 775 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అయోధ్యా కాండము: ప్రస్థాన ఖండము)

జీబులల్లిన వనీసీమలోఁ బులుల సింగముల కాల్జాడలు గాంచినపుడు
కొండలపై నుండి కురిసెడు సెలయేళ్ళ సోనజల్లులవాక చూచినపుడు
అలపైని గొండకొమ్ములు తెల్లమబ్బులు క్రమ్మిపోయెడు వేళఁగనినయపుడు 
ఒకపెనుగాలి యుఱ్ఱూత లూగించుచో గళవళంపడు కానఁ గాంచినపుడు

భీతి పుట్టిననైనను భీతిలోనఁ
బ్రీతి తెలియకయును విడంబించు గాదె !
యచ్చముగఁ జెడ్డవస్తు వీ యవనిఁ గలదె

మించి సర్వము సుఖదుఃఖమిశ్రితంబె.

కలువపూమోము రాఘవ ! నీది వాడిన చల్లని కరములఁ జూడఁగలను
తమ్మిపూవంటి పాదము నీది నొచ్చినఁ దరణిబాష్పంబుల విరియఁగలను
సంపెఁగవోని నీ స్వాంతమ్ము గుఱుతించి షట్పదదూరంబు సాగఁగలను
చేమంతివోని నీ చేతఃప్రసన్నత శిశిర, మంజులత స్పృశింపఁగలను

  ఏట మున్గువానిని లేవనెత్తబోవఁ
గాళ్ళకడ్డమ్ము తిరిగి రక్షకుని ప్రాణ 
ములకుఁ దెచ్చెడి మూఢుని పోల్కి గాను
తక్కినవి యౌదుగాను, సంస్థాస్వరూప

సీత రామునితో పాటు వనవాసం చేయటానికి అనుమతి కోరుతూ, అడవితల్లి అంటే తనకెంత ఇష్టమో, అక్కడ రాముని కేవిధమైన సపర్యలు చేయదలిచిందో చెప్పింది.

" దట్టంగా ఉన్న అడవిలో, పులుల యొక్క, సింహాల యొక్క కాలిజాడలు కనిపించినపుడు, కొండలపై నుండి క్రిందికి  జాలువారే సెలయేళ్ళ నీటిధారల అందం చూసినపుడు, ఎత్తుగా ఉన్న కొండకొమ్ములను రాసుకొంటూ తెల్లని మబ్బులు క్రమ్ముకొన్న సమయాన దృశ్యాన్ని చూసినపుడు, పెనుగాలి ఉద్ధృతంగా వీచినపుడు, కళవళపడిపోయిన అరణ్యాన్ని చూసినపుడు, మనస్సులో భయం కలిగినా కూడా, ఏదో తెలియని ఇష్టం పుట్టుకొస్తుంది. ప్రపంచంలో అచ్చంగా చెడ్డవస్తువంటూ ఏమన్నా ఉందా? అంతా సుఖాదుఃఖాలతో కూడుకొని ఉన్నదే కదా !

రామా ! కలువపువ్వు వంటి నీ ముఖం వాడిపోయినపుడు చల్లని కరస్పర్శతో నిన్ను సేదదీర్చగలనుతమ్మిపూవు వంటి నీ సుకుమారమైన పాదాలు నొప్పిపుట్టినప్పుడు, వెచ్చని నా కన్నీటితో బడలిక పోగొట్టగలనుసంపెంగపూవు వంటి నీ ఏకాంతానికి భంగం కలుగకుండా, తుమ్మెదలాగా (ఆరడుగుల) దూరాన్ని పాటించగలను. చేమంతిపూవు వంటి నీ మనఃప్రసన్నతను శిశిర ఋతువు నందలి మెత్తదనంతో స్పృశింపగలనుఅయ్యో ! పాపమని నన్ను నీతో తీసుకువెళ్ళిన నేరానికి, ఏటిలో మునిగిపోతున్నవాడిని రక్షించటానికి వెళ్ళిన వాడి కాళ్ళు పట్టుకొని, రక్షకుని ప్రాణాలు తీసేటటువంటి మూర్ఖురాలి వంటి దానిని కాదు. ఇంకే విధంగాను కూడా నీకు ఇబ్బంది కలిగించను. "

సీత ప్రకృతి స్వరూపిణి. అందుచేత, ప్రకృతిలోని సమస్త వృక్ష, జంతు, వస్తుజాలంతో తాదాత్మ్యం చెందుతుంది

ఇక రెండవ పద్యంలో, రామునికి చేసే సపర్యలను గురించి చెబుతూ, భర్తను ' సంస్థాస్వరూప ! ' అని సంబోధించిందిరాముడు చక్కని వివాహ వ్యవస్థకు, కుటుంబ వ్యవస్థకు, సంఘ వ్యవస్థకు, రాజ్య వ్యవస్థకు, ధర్మ వ్యవస్థకు ప్రతీక.

విశ్వనాథ రాముని అవయవసంపదను పువ్వులతో పోలిక తెచ్చిన తీరు, అత్యంత రమణీయంకలువ చంద్రుని చల్లని కిరణాలతో వికసిస్తుందితమ్మిపూవు అతి సుకుమారమైనది. అది హేమంతంలోని మంచుబిందువులతో స్వచ్చంగా ఉంటుంది. షట్పద అంటే తుమ్మెద. తుమ్మెద అన్ని పువ్వుల మీద వ్రాలుతుంది ఒక్క సంపెంగ తప్ప. దూరాన్ని పాటిస్తుందిచేమంతులు శిశిరంలో విరియబూస్తాయిచేమంతి మెత్తదనానికి ప్రతీక. శిశిరంలో చెట్లు మారాకులు తొడుగుతాయి. మనస్సు యొక్క ప్రశాంతభావం చిగురుటాకుల మెత్తదనంతో పోల్చబడింది. విధంగా విశ్వనాథ వర్ణనలు కథలో అంతర్భాగంగా ఉండి, సహజ సుందరంగా భాసిల్లుతాయి

రెండు సీస పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, ప్రస్తాన ఖండము లోనివి.

like